తెలంగాణ ముఖ్యమంత్రి మారబోతున్నారా? కేటీఆర్ కు పట్టాభిషేకం ఎప్పుడు?  ఇదే ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలు, జనాల్లోనూ దీనిపైనే చర్చ జరుగుతోంది. అయితే టీఆర్ఎస్ నేతల మాటలను బట్టి ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పగ్గాలు అప్పగించడం ఖాయమనే తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు కూడా కేటీఆర్ కు సీఎం పదవిపై కామెంట్లు చేస్తండటం ఇందుకు బలాన్నిస్తోంది.

                   కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తన చర్చకు దారి తీయగా.. తాజా మరో మంత్రి కూడా అవే వ్యాఖ్యలు చేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా కేటీఆర్‌ సీఎం అయితే తప్పేముందని అన్నారు. కేటీఆర్‌ అన్ని పనులు చేయగలడని, సరైన సమయంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు తలసాని. కాళేశ్వరంపై అవగాహన లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. 70 ఏళ్లుగా తెలంగాణ ఎడారిగా ఉందని, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మాట్లాడాలని బీజేపీ నేతలకు సవాలు విసిరారు తలసాని శ్రీనివాస్ యాదవ్.
 
            ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్‌ సమర్థుడని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్ ఇదివరకే అభిప్రాయం వ్యక్తం చేశాడు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటిఆర్ అధ్యక్షతన జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఇది కేవలం తన ఒక్క అభిప్రాయమే కాదని, చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలనుందని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజి రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ను సీఎం  చేయాలని కోరుకుంటున్న వారిలో తానూ ఒకడినని చెప్పుకొచ్చారు.ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడని కామెంట్ చేశారు. టీఆర్ఎస్ నేతల వరుస కామెంట్లతో కేటీఆర్ కు సీఎం పదవి ఖాయమనే తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: