ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘటన జరిగింది. మాజీ మంత్రి, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావును పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా కళా వెంకట్రావుపై కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి రాజాంలోని కళా వెంకట్రావు ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కళా వెంకట్రావు కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదని తెలుస్తోంది.  కళావెంకట్రావు అరెస్ట్ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన నివాసానికి భారీగా చేరుకున్నారు. పోలీసుల చర్యను ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళా వెంకట్రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కళా వెంకట్రావు నివాసం దగ్గర పోలీసులను భారీగా మోహరించారు.
 
              కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కళా వెంకట్రావు ఆరోగ్యం సరిగాలేదని, ట్యాబ్లెట్లు కూడా ఇవ్వనీయకుండా తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. దీంతో రాజాంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కళా అరెస్టుపై ఏపీ టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కళాను వెంటనే విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

               మాజీ మంత్రి, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు  కళా వెంకట్రావు అరెస్ట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రామ‌తీర్థంలో రాముడి విగ్ర‌హం త‌ల ఎత్తుకెళ్లిన వారిని ప‌ట్టుకోలేక‌పోయిన చేత‌కాని స‌ర్కారు.. అత్యంత సౌమ్యుడైన బీసీ నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు కిమిడి క‌ళావెంక‌ట‌రావును అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారం అండ‌తో ఇంకెంత‌మంది బీసీ నేత‌లపై త‌ప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తావు జ‌గ‌న్‌రెడ్డీ?.’’ అని లోకేశ్ ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: