వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి బాధ్యతల నుంచి ట్రంప్ దాదాపు తప్పుకున్నారు. మరి కాసేపట్లో అగ్రరాజ్యం కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్ది గంటల క్రితమే ట్రంప్.. తన కుటుంబంతో సహా వైట్ ‌హౌస్‌ను వీడారు. మాజీ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌ను వీడేందుకు ట్రంప్ మనసొప్ప లేదని తెలుస్తోంది. ఈ కారణంగానే అధ్యక్షుడి హోదాలోనే వైట్‌హౌస్‌ను వీడాలని ట్రంప్ భావించారు. అందుకే అధ్యక్షుడి ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరారు. విమానం ఎక్కే ముందు ట్రంప్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చివరి ప్రసంగం ఇదే. ఈ ప్రసంగం సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుటికీ మీ కోసం పోరాడుతూనే ఉంటాను. నేను ఎక్కడున్నా అంతా చూస్తూనే ఉంటా. వింటూనే ఉంటా. నేర్చుకుంటూనే ఉంటా. ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఈ దేశ భవిష్యత్తు ఇంత కన్నా గొప్పగా చరిత్రలో ఎప్పుడూ లేదు. రాబోయే కొత్త ప్రభుత్వానికి, పాలక వర్గానికి నా శుభాకాంక్షలు. కొత్త ప్రభుత్వం అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

అగ్రరాజ్యం అధ్యక్షుడి హోదాలో ట్రంప్ ఇచ్చిన చివరి ప్రసంగం ఇదే. ఈ ఉపన్యాసంలో ట్రంప్.. కాబోయే నూతన అధ్యక్షుడు జో బైడెన్ పేరును అస్సలు ప్రస్తావించ లేదు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత శతాబ్ద కాలంగా ప్రతి అమెరికా అధ్యక్షుడూ.. తన తర్వాత వచ్చే ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు కాలేదు. కానీ.. ట్రంప్ మాత్రం కనీసం జో బైడెన్ పేరును కూడా ప్రస్తావించకుండా ఉపన్యాసం ముగించారు. అంతే కాదు బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకానని గతంలోనే ప్రకటించారు. అన్న మాట ప్రకారమే ప్రమాణ స్వీకారాని కన్నా ముందే ఫ్లోరిడాకు వెళ్లిపోయారు. అయితే ఆయన జో బైడెన్‌ కోసం వైట్ ‌హౌస్‌లో ట్రంప్లెటర్ ఉంచారని వార్తలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: