న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎన్నడూలేని అతిపెద్ద కొవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరా కార్యక్రమాన్ని భారత్‌ ఈ నెల6 నుంచి విజయవంతంగా కొనసాగిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అత్యంత కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకాల వాడకంపై వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. టీకాను బయటకు తీసిన వెంటనే నేరుగా వ్యక్తికి షాట్ ఇచ్చేయాలని, అలా కాకుండా ఆలస్యం చేస్తే ఆ టీకా వృథా అయిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒకసారి సీలు తెరిచిన సీసాలోని టీకాను.. 4 గంటల్లోగా ఉపయోగించాలని, లేకుంటా దాని ప్రభావం పూర్తిగా పోతుందని, అలాంటి వ్యాక్సిన్‌లను తీసుకుంటే అనేక ప్రమాదాలు సైతం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దాంతో వాటిని నాశనం చేయడం మినహా వేరే దారి ఉండదని చెబుతున్నారు.

‘‘ప్రతి వ్యాక్సిన్ సీనా 5 ఎ.ఎల్‌ వ్యాక్సిన్‌‌ను కలిగి ఉంటుంది. ఈ ఒక్కొకో సీసా 10 డోసులకు సరిపడే వ్యాక్సిన్‌తో ఉంటుంది. ఈ సీసా సీలును ఒకసారి దీనిని తెరిచిన నిర్ణీత సమయంలో అందులో ఉండే పది డోసులను వాడేయాలి. లేకుంటే వాటి సమయం నాలుగు గంటడిచి పోతే అవి దేనికీ పనికిరాకుండా పోతాయి. ఈ వ్యవధి లోగా పూర్తి సీసాను వినియోగించడం వీలుకానప్పుడు మిగిలిపోయిన డోసులు వ్యర్థమైనట్లే. ఇక వాటిని వినియోగించ కూడదు. మిగిలిన డోసులను అనంతరం నాశనం చేయాలి’’ అని రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి (ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్‌) అధికార ప్రతినిధి ఛవీ గుప్తా తెలిపారు.

తమ ఆసుపత్రిలో వ్యాక్సిన్ సరఫరా మొదలైన తొలి రోజు 45 మందికి టీకాలు వేశామని, ఈ క్రమంలో నాలుగు సీసాలు పూర్తిగా వినియోగించామని తెలిపారు. ఇక చివరిది ఐదో సీసాలోని ఐదు డోసులు వాడిన అనంతరం మిగిలిన ఐదు ఉపయోగం లేకుండా పోయాయని ఆమె తెలిపారు. ఈ విధమైన వ్యాక్సిన్‌ వృథా అనివార్యమని ఆలోచించి ఇటువంటి కారణాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పది శాతం అధికంగా టీకాలను అందజేస్తోందని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని (ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్‌) దేశంలో వ్యాక్సిన్‌ నిల్వకు కేంద్ర స్థానం ‘సెంట్రల్‌ స్టోరేజ్‌ ఫెసిలిటీ’గా ఉపయోగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: