వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కొత్త అధ్యాయం మొదలైంది. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. మరోపక్క ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ బైడెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించగా.. సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సొటోమేయర్ కమలా హ్యారిస్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. తన కుటుంబానికి చెందిన 127 ఏళ్ల నాటి బైబిల్‌పై బైడెన్ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం జో బైడెన్ మాట్లాడుతూ.. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని అన్నారు. ఇది అమెరికా ప్రజలందరి విజయమని చెప్పారు. ముందు ముందు సాధించాల్సింది చాలా ఉందని అన్నారు. 


క్యాపిటల్ హిల్ హింసతో అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని అందరూ భయపడ్డారని, అమెరికాలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని జో బైడెన్ పేర్కొన్నారు. 78 ఏళ్ల వయసులో జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద వయసులో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా జో బైడెన్ కొత్త రికార్డు సృష్టించారు. మరోపక్క బైడెన్ ప్రమాణ స్వీకారం చేసే కొద్ది నిమిషాల ముందే ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం తర్వాత హాలీవుడ్ దిగ్గజ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ‘అమెరికా ది బ్యూటిఫుల్’ అనే పాటను పాడి అందరిని ఆకట్టుకున్నారు. 


కాగా.. బైడెన్- కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి గైర్హాజరయ్యారు. గడిచిన దశాబ్ద కాలంలో అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి అంతకు ముందు అధ్యక్షుడు హాజరుకాకపోవడం అన్నది జరగలేదు. ట్రంప్ వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడాకు కొద్ది గంటల ముందు వెళ్లిపోయారు. ఇక నుంచి ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లోనే నివసించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: