కపిల తీర్థం టు రామతీర్థం అంటూ రాష్ట్రంలో బీజేపీ తలపెట్టిన యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పోలీసులు ప్రభుత్వ ఒత్తిడితో తమ యాత్రను అడ్డుకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.

ఫిబ్రవరి  4న తిరుపతిలో భారీ బహిరంగ సభ అనంతరం యాత్ర చేపట్టాలని బీజేపీ శ్రేణులు నిర్ణయించాయి. కపిల తీర్థం నుంచి.. విజయనగరం జిల్లా రామతీర్థం వరకు రెండు వారాలపాటు యాత్ర కొనసాగించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గతంలో జనసేన తలపెట్టిన యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈసారి కూడా బీజేపీ యాత్రను అడ్డుకుంటారని, అనుమతి ఇవ్వరనే అనుమానాలున్నాయి. ఈ క్రమంలో పోలీసులు తమ యాత్రకు అనుమతివ్వకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని పార్టీ వర్గాలంటున్నాయి.

మరోవైపు త్రిదండి చినజీయర్ స్వామి యాత్ర ఏపీలో నిరాటంకంగా కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ‌లోని పలు దేవాలయాలపై దాడులు జరగడం సరికాదని, అలజడి తగ్గించేందుకే ఆలయాలను సందర్శిస్తున్నట్లు చినజీయర్‌ తెలిపారు. ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన నందలూరులోని సౌమ్యనాథ స్వామి ఆలయం, ఒంటిమిట్ట రామాలయాన్ని దర్శించుకున్నారు. విగ్రహాల ధ్వంసం వెనుక కనిపించని శక్తులున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల్లో భక్తిభావం పెరిగినప్పుడే ఆలయాల సంరక్షణ సాధ్యపడుతుందని చెప్పారు. ప్రజలు సైతం ఆలయాల రక్షణ బాధ్యతలు తీసుకోవాలని చినజీయర్‌ స్వామి సూచించారు.  సందర్శన అనంతరం ఆలయాల్లోని విగ్రహాల స్థితిగతులు, సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలిస్తామని ఆయన తెలిపారు.

అటు చినజీయర్ యాత్రకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, పోలీసులు తమ యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. రాజకీయ కారణాలతో ఉద్దేశ పూర్వకంగా యాత్రకు అడ్డు తగిలితే సహించేది లేదని అంటున్నారు. ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఆలయాల ఘటనలో బీజేపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసులు పెట్టడంతో నాయకులు మండిపడుతున్నారు. అసలు కారకులను పట్టుకోకుండా తమపై రాజకీయ కక్షసాధింపుకి పాల్పడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోయాత్రకు అనుమతివ్వకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: