కరోనా కష్టకాలంలో పరీక్షలు లేకుండా ఆల్ పాస్ అంటూ అందరికీ ఊరటనిచ్చాయి ప్రభుత్వాలు. ఆ ఆఫర్ తో ఎన్నో ఏళ్లుగా ఫెయిలవుతూ వచ్చినవారంతా కరోనా దెబ్బకి పాసైపోయారు, పండగ చేసుకున్నారు. ఇక ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గినా కూడా విద్యార్థులకు వచ్చిన ఆఫర్ మాత్రం వెనక్కి పోలేదు. తాజాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిలైన 1.92లక్షల మంది విద్యార్థులను సప్లిమెంటరీ లేకుండానే పాస్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. వీరందరికీ కనీస మార్కులు ఇచ్చి పాస్ చేయించే దిశగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. బెటర్ మెంట్ కోసం పరీక్షలు రాసే విద్యార్థులు, ఎక్కువ మార్కులు కావాలంటే మే నెలలో మరోసారి అవకాశం కల్పించాలనుకుంటున్నారు.

తరగతులు ప్రారంభించడానికి ముందే ఇంటర్ వార్షిక పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ వార్షిక పరీక్షలు మే నెల 3 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మే 19నుంచి ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మొదలు పెట్టాలని కసరత్తులు చేస్తున్నారు అధికారులు. 24వ తేదీ లోగా అన్ని పరీక్షల్ని నిర్వహిస్తామంటున్నారు. గతంలో ఏప్రిల్‌ నెలాఖరులో పరీక్షలు ప్రారంభించాలని ఆలోచించినా. జేఈఈ ఎగ్జామ్ కారణంగా వాయిదా వేశారు. ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్‌ మూడో విడత పరీక్షలు.. మే 24 నుంచి చివరి విడత జేఈఈ మెయిన్‌ ఉన్నందున ఇంటర్‌ పరీక్షలను మే 3న ప్రారంభించి 24వ తేదీకి పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు.

ఇంటర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్‌ వరకు తరగతులు జరుగుతాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో మొత్తం 68 రోజులు మాత్రమే తరగతులు నిర్వహిస్తారు. అయితే షిఫ్టు విధానం కాకుండా ఒక రోజు ఫస్ట్ ఇయర్, తర్వాతిరోజు సెకండ్ ఇయర్ తరగతులు జరపాలని తాజాగా ప్రభుత్వం సూచించింది. ఇది అమలైతే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 34రోజులు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు 34 రోజులు మాత్రమే క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది. సబ్జెక్టుల్లో 70 శాతం సిలబస్‌ పైనే వార్షిక పరీక్షలుంటాయి. మిగిలిన 30 శాతం నుంచి అసైన్‌ మెంట్లు ఇస్తారు. అసైన్ మెంట్లకు ఇంటి వద్ద సమాధానాలు రాసి పంపించాల్సి ఉంటుంది. మొత్తమ్మీద కరోనా దెబ్బకి తెలంగాణలో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఆల్ పాస్ అంటూ సంబరపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: