ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు చాలాకాలంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదం. మంచి, మానవత్వం లేకుండా కర్కషంగా, అతి కిరాతకంగా తాము నమ్మే మూర్ఖపు సిద్ధాంతాల కోసం మనుష్యుల ప్రాణాలను బలి తీసుకుంటుంటారు. వారిలో పిల్లలు, వృద్దులు, వ్యాధిగ్రస్తులు అనే తేడాలేవీ లేకుండా మరీ వారిని చంపి రాక్షసానందాన్ని పొందుతారు. ఇప్పుడు అలాంటి దుర్ఘటన ఒకటి ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో చోటు చేసుకుంది. ఒక ఉగ్రవాది తను అస్వస్థతకు గురైనట్లు నటించి పడిపోయాడు వెంటనే అతన్ని ఆదుకోవడానికి చుట్టుపక్కల ఉన్నవారు దగ్గరికి రాగానే ఒక్కసారిగా పేల్చుకున్నాడు. కాసేపటి తర్వాత అక్కడి క్షతగాత్రులను కాపాడటానికి స్థానికులు, అధికారులు గుమిగూడగా మరో ఉగ్రవాది వారిలో చేరి పేల్చుకున్నాడు. ఈ జంట ఆత్మాహుతి దాడులతో గురువారం (జనవరి 21) నాడు ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఒక్కసారిగా చిగురుటాకులా వణికిపోయింది.


 ఈ ఉగ్రవాద దాడుల్లో ఇప్పటివరకు 30 మంది మరణించారు. మరో 72 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు తెలిపారు. చెల్లా చెదురుగా పడిన మృతదేహాలు, తెగిపడ్డ శరీర అవయవాలతో ఘటనా స్థలి భీతావహంగా మారిందని అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. నిత్యం వినియోగదారులతో కిటకిటలాడే బాగ్దాద్‌లోని బాబ్‌ అల్‌ షార్కీ ప్రాంతంలోని ఒక మార్కెట్‌లో గురువారం ఉదయం ఉగ్రవాదులు ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఇరాక్‌‌లో ఇప్పటివరకు ఇలాంటి ఘోరం చూడలేదని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి అన్నారు. ఇది ఇలా ఉండగా ఇరాక్‌లో గతంలో జరిగిన అల్లర్లలో కూడా చాలామంది మృత్యువాత పడ్డారు అలాగే తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని బాగ్దాద్‌తో పాటుగా పలు ఇతర నగరాలు ఇలాంటి అల్లర్లకు, దాడులకు ఎక్కువగా బలి అవుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ఈ విధ్వంసకర దాడులు మాత్రం ఆగటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: