వైసీపీ ప్రభంజనంతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. ఈ క్రమంలో కొందరు టీడీపీ నేతలు జగన్ పార్టీ వైపు తొంగిచూశారు. చంద్రబాబుపై నమ్మకం పోయిందని.. వైసీపీ ప్రభుత్వ పథకాలు, విధానాలు నచ్చాయంటూ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు జగన్‌కి జై కొట్టిన విషయం తెలిసిందే. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, విశాఖ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ బహిరంగంగానే జగన్‌కు మద్దతు తెలిపారు. అయితే రాజీనామా చేసే పార్టీలు మారాలంటూ గతంలో జగన్ పలుమార్లు చెప్పారు. దీంతో ఆ నిబంధన వారికి అడ్డంకిగా మారడంతో పార్టీ కండువా కప్పుకోకుండా బయటి నుంచే కొందరు మద్దతు తెలుపుతున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం కూడా జగన్‌కి‌ మద్దతిచ్చారు. కొడుకు కరణం వెంకటేష్‌ వైసీపీలో చేరారు. ఇక గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన శిద్దా రాఘవరావు సైతం అదే దారి పట్టారు. ఆ వరుసలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వైసీపీలో గూటిలో చేరారు.
                                    టీడీపీ హయాంలో ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. ఇటీవల ఆమె రాజీనామా చేసిన స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో సీఎం జగన్.. తిరిగి ఆమెకే అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎన్నికలో పోతుల సునీత మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. జగన్ ఆకాంక్ష మేరకు సునీత రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవిని తిరిగి ఆమె కైవసం చేసుకున్నారు. శాసన సభ్యుల కోటాలో జరిగిన ఉప ఎన్నికలో సునీత ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం.. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డి ధ్రువీకరణ పత్రాన్ని పోతుల సునీతకు అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: