ఏలూరు: జమిలి ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడారు. జమిలి ఎన్నికలు రావొచ్చని ప్రధాని మోదీనే ఈ విషయం చెప్పారన్నారు. వైసీపీ వచ్చాక టీడీపీ నేతలపై 1,350 కేసులు పెట్టారని తెలిపారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. డీజీపీ లా అండ్‌ ఆర్డర్‌ ఇలాగే నిర్వహిస్తారా? అని నిలదీశారు.

‘బూతుల మంత్రి ఇంటి కొచ్చి కొడతానని అంటున్నాడు.. ఆయనేమైనా రౌడీనా? బుల్లెట్లకే భయటపడలేదు. మీరు రాబోయే రోజుల్లో రోడ్లు మీద తిరగాలి గుర్తుపెట్టుకోండి. కొన్ని సంఘాలు.. వారి సభ్యుల గురించి పనిచేయాలి.. కానీ రాజకీయాలు మాట్లాడుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన సమయంలో ఎన్నికలు పెడతామంటే కోర్టుకు వెళ్ళారు. మంత్రులు రాజీనామా చేయాలని ఎస్‌ఈసీని డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు చేస్తారా? తప్పు చేసిన వాడికి తప్పకుండా శిక్ష కూడా పడుతుంది’ అని మండి పడ్డారు.

‘పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి.. ప్రజలు మాకు ఎందుకు అనుకుంటే వారే నష్టపోతారు. ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేస్తూ,  దొడ్డిదారిన పరిపాలన చేయాలని చూస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఒక కుదుపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఒక సైకో ప్రభుత్వం, ఉన్మాద ప్రభుత్వం.. ట్రంప్ పరిస్థితి ఏమైందో చూడండి. ఒక రహస్య అజెండా పెట్టుకున్నారు. దానిని కొనసాగించనివ్వం. వైసీపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైంది. అరాచకపాలనకు ఒక అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఐపీసీని ఫాలో అవ్వాలి కానీ,  జగన్ ఐపీసీని కాదు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని కట్ చేస్తే.. మీడియా వారు ఏం చేస్తున్నారు’ అని ప్రశ్నించారు.

‘నేను క్రిస్టియన్ అన్నది జగన్‌ను.. కానీ క్రిస్టియన్స్ కాదు. నిజమైనా క్రిస్టియన్ ఎవరూ బాధపడరు. రాముడు తల నరికితే పోరాటం చేయనక్కరలేదా? ఎన్నికలపై కోర్టులు వెళుతున్నారు.. వారికి సంబంధం ఏమిటి? టీచర్లను మద్యం షాపుల వద్ద విధులకు వేస్తే, ఉద్యోగ సంఘాలు ఏం చేశాయి. కరోనా ఎక్కువగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో ఎన్నికలు జరగలేదా? వారు ఉద్యోగులు కాదా? అని చంద్రబాబు అడిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: