అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది. స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో 11 జిల్లాల కలెక్టర్లతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ముచ్చటించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల జాయింట్ కలెక్టర్-1తో ఎస్ఈసీ మాట్లాడారు. హైకోర్టు తీర్పు అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు జరపాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగాలని కలెక్టర్లకు రమేష్ ‌కుమార్ సూచనలు చేశారు. అంతకు ముందు ఎస్ఈసీ కార్యాలయంలో ఉద్యోగులతో రమేష్‌ కుమార్ భేటీ అయ్యారు.

 
స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేయడం జరిగింది. ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌కు హైకోర్టు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించింది. కాగా.. ఈనెల 8వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

హైకోర్టు తీర్పు అనంతరం నిమ్మగడ్డ రమేష్ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 4 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉంది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందడం ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ విషయాన్ని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నికలకు సహకరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తాం’ అని ఎస్‌ఈసీ రమేష్‌ మీడియాకు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: