అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళకు కరోనా వచ్చింది. అనారోగ్య కారణాలతో రెండు రోజుల క్రితమే బెంగుళూరులోని ఆస్పత్రిలో చేర్చారు జైలు అధికారులు. కరోనా లక్షణాలు కనిపించడంతో... పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలింది. ఈనెల 27న జైలు నుంచి విడుదల కానుండగా... ఇంతలోనే ఆమెకు కరోనా సోకింది.

అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దగ్గు, జ్వరం రావడంతో జైల్ లో చికిత్స అందించారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు. దాంతో బౌరింగ్‌ అండ్‌ లేడీ కర్జాన్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరే సమయానికి శశికళ శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టు నిర్వహించగా నెగటీవ్‌ వచ్చింది. దీంతో శాంపిల్స్‌ సేకరించి ఆర్టీ-పీసీఆర్ టెస్టుకు పంపారు. ఈ పరీక్షలో కరోనా పాజిటివ్‌ తేలింది.

కరోనా పాజిటివ్‌గా తేలడంతో... శశికళను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఆమె వయస్సు 66 ఏళ్లు. పైగా  టైప్ 2 డయాబెటిస్, హైపర్ టెన్షన్, హైపర్ థైరాయిడిజం, యూటీఐతో బాధపడుతున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆమెకు ఆక్సిజన్‌ అవసరమవుతోంది. అయితే శశికళ ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఆమెకు యాంటీబయోటిక్స్ ఇస్తున్నామన్నారు. ఆమె ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని గుర్తించారు. అది కొంచెం తీవ్రంగానే ఉన్నట్టు సీటీ స్కాన్‌లో తేలింది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు శశికళ. ఈ నెల 27తో శశికళ నాలుగేళ్ల జైలుశిక్ష పూర్తి కానుంది. దీంతో భారీ ర్యాలీగా ఆమెను చెన్నైకి తీసుకెళ్లాలని శశికళ మేనల్లుడు ఎఎమ్ఎమ్ కె పార్టీ అధినేత దినకరన్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.  మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా.. ఇంతలోనే ఆమె ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరడంతో ఆందోళన చెందుతున్నారు అభిమానులు. మొత్తానికి కరోనా ఆరోగ్య పరిస్థితిపై ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: