అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జోరు పెంచారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి చకచకా ఏర్పాట్లు చేసేస్తున్నారు రమేష్ ‌కుమార్. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను శనివారం విడుదల చేసేందుకకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది. నిమ్మగడ్డతో పంచాయతీరాజ్ అధికారులు భేటీ అయ్యారు. నిమ్మగడ్డతో భేటీకి ముందు సీఎం జగన్‌తో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది, గిరిజా శంకర్ తదితర అధికారులు సమావేశం అయ్యారు. అంతకు ముందు గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ ‌తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో సుమారు 20 నిముషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అంశాలు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విషయాలు, ఎలక్షన్ల షెడ్యూల్ తదితర వివరాలను గవర్నర్ ‌కు వివరించారు. ఎన్నికలకు సహకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరినట్లు సమాచారం.  

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని చూసిన వైసీపీ ప్రభుత్వానికి అక్కడ కూడా షాక్ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, ముందు దాన్ని సరి చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్‌ను వెనక్కి పంపింది. ఈ క్రమంలో మళ్లీ ఈరోజే రిజిస్ట్రీ పిటిషన్‌ను సరిచేసి దాఖలు చేయలేమని వైసీపీ లాయర్లు చెప్తున్నారు. మధ్యలో ఆదివారం కోర్టుకు సెలవు ఉండటంతో సోమవారం వరకు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఆదివారమే విడుదల చేయాలని ఎన్నికల సంఘం  భావిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పిటిషన్ దాఖలు చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి మరో ఛాన్స్ దొరకడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: