బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత, అధ్యక్షుడు అయిన లాలూప్రసాద్ యాదవ్పై గల పశుగ్రాసం దాణా కేసు నేపథ్యంలో కారాగార శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం హఠాత్తుగా గురువారం సాయంత్రం క్షీణించడంతో ఆర్జేడీ పార్టీ వర్గాలు కంగారు పడ్డాయి. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం లాలూకు ఝార్ఖండ్‌ రాష్ట్ర రాజధాని అయిన రాంచీలో రిమ్స్‌ ఆసుపత్రిలో ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతోంది. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న లాలూ.. అనారోగ్య కారణంతో గత కొద్ది కాలం నుంచి రిమ్స్‌లో ఉన్నారు. అయితే గురువారం సాయంత్రం ఆయన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో వైద్యులు ఆయనకు తక్షణమే అత్యవసర చికిత్స అందజేశారు.



లాలూ పరిస్థితి గురించి తెలుసుకున్న జైలు అధికారులు, ఝార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ సారథ్యంలోని వైద్య బృందం లాలూ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ.. లాలూ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు పలు పరీక్షలు చేశామని తెలిపారు. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనలో స్వల్ప న్యుమోనియా లక్షణాలు ఉన్నాయని అన్నారు. ఈ అంశంపై ఎయిమ్స్ నిపుణులను సంప్రదించామని, వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ‘లాలూకి నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్‌లో కోవిడ్ నెగెటివ్‌గా వచ్చింది.. నమూనాలను సేకరించి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌కు పంపాం.. ఫలితాలు శుక్రవారం వస్తాయి’ అని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. లాలూ ఏదైనా నిర్దిష్ట అనారోగ్యానికి గురయ్యారా అని తెలుసుకోడానికి కిడ్నీ పనితీరును పరీక్షించామని వివరించారు. మూత్రపిండాలు, గుండె జబ్బు సహా వివిధ అనారోగ్యాలతో ఆయన బాధపడుతున్నందున వివిధ పరీక్షలను నిర్వహించాం.. ఫలితాలు సాధారణం కంటే ఎక్కువగానే ఉన్నాయని, ఆయన అనారోగ్యంతో ఉన్నాడు’ అని రిమ్స్ డైరెక్టర్ అన్నారు. కాగా ఇటీవలే బీహార్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో జేడీయూ మరియు బీజేపీల కూటమికి ముచ్చెమటలు పట్టించిన తేజస్వీ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల పుత్రరత్నమే.

మరింత సమాచారం తెలుసుకోండి: