తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నగారా మోగడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చక చకా జరిగిపోతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆదివారమే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించ వద్దని ప్రభుత్వం, సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ వాదిస్తున్నాయి. దీనిపై హైకోర్టులో కూడా పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్.. వైసీపీ ప్రభుత్వానికి మద్దుతాగా ఎన్నికలు వాయిదా వేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టులోనే సవాల్ చేశారు. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహించ వద్దని సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చింది. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. దీని కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.

ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో తనకు అర్థం కావడంలేదని పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కరోనా ఉందని, పంచాయతీ ఎన్నికలు వద్దని ప్రభుత్వం చెబుతోందని, మరి ఇలాంటి సమయంలో స్థానిక ఎన్నికలు జరగాలా? వద్దా? అన్న మీడియా  ప్రశ్నకు పవన్ షాకింగ్ సమాధానం ఇచ్చారు. ‘‘నిజంగా వైసీపీ ప్రభుత్వానికి కరోనా మహమ్మారే ఇబ్బంది అయితే ఆలోచించ వచ్చని, కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలో బర్త్‌డే పార్టీలు చేసుకున్నారు. మద్యం షాపులు ప్రారంభించారు. దాంతో గుంపులు గుంపులుగా ప్రజలు క్యూలైన్‌లో నిలుచున్నారు. అప్పుడు కరోనా లేదా?’’ అని పవన్ ప్రశ్నించారు. ఇప్పుడు కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని వాదించడం సరికాదని ఆయన అన్నారు. ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని, ఎన్నికలకు తాము మద్దతు ఇస్తామని పవన్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: