హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత  భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు అయింది. శుక్రవారం నాడు అఖిల ప్రియకు సెషన్స్ కోర్టు బెయిల్ ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పది వేల రూపాయల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలను సమర్పించాలని అఖిల ప్రియను కోర్టు ఆదేశించింది. చంచల్ గూడ జైల్లో 17 రోజులుగా అఖిల ప్రియ రిమాండ్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. రేపు అంటే శనివారం నాడు అఖిల ప్రియ.. జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి.

భార్గవ్‌కు చుక్కెదురు..
అఖిల ప్రియుకు బెయిల్ మంజూరు చేసిన సెషన్స్ కోర్టు.. ఆమె భర్త భార్గవ్ రామ్‌కు బెయిలు ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో భార్గవ్ రామ్ కు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైనట్లు అయింది. భార్గవ్ రామ్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టి వేసింది. కాగా.. ఈ కేసులో ఏ3 గా భార్గవ్ రామ్‌ ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం జరగదని పోలీసులు చెప్తున్నారు. బోయినపల్లిలో ప్రవీణ్ సోదరుల కిడ్నాప్ జరిగింది. ఆ తరువాత భార్గవ్ రామ్.. తానే స్వయంగా కారు నడుపుతూ ప్రవీణ్ రావు, అతని సోదరులను ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లాడని పోలీసులు అంటున్నారు. భార్గవ్ రామ్ ను విచారిస్తే మరి కొంత సమాచారం బయటపడే అవకాశం ఉందని, కేసులో కీలక విషయాలు వెల్లడి అవుతాయని వాళ్లు భావిస్తున్నారు. ఈ సమయంలో భార్గవ్ రామ్ కు గనుక బెయిల్ ఇస్తే సాక్షులను కచ్చితంగా ప్రభావితం చేస్తాడని, కావున ఇలాంటి విషయంలో ఛాన్స్ తీసుకునే సాహసం చేయలేమని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: