మోదీ ప్రభుత్వం మరో కొత్త నోటు మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త రూ.500, రూ.2,000 నోట్లను వ్యవస్థలో చెలామణిలోకి తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం కొత్త నోట్లతో భారత కరెన్సీ మెరిసిపోతోంది. 10 రూపాయల నుంచి రూ.2వేల వరకు అన్ని కొత్త నోట్లు వచ్చేశాయి. ఇక తాజాగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను మార్చి లేదా ఏప్రిల్ లోగా ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. ఈ విషయాన్ని ఆర్బీఐ జనరల్ మేనజర్ బీ.మహేష్ తెలిపారు. పాత సిరీస్‌లో ఉన్న నోట్లను మార్చి నాటికి చెలామణిలో లేకుండా చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆరు సంవత్సరాలుగా ఈ నోట్లను ఆర్బీఐ ముద్రించడం లేదని చెప్పారు.

అయితే ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పాత నోట్లు అంతటా చెల్లుబాటు అవుతాయి. బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే పాత నోట్లను మాత్రం ఆర్బీఐ సేకరిస్తుంది. వాటిని మళ్లీ మార్కెట్‌లోకి వదలదు. అలా పూర్తి స్థాయిలో మార్చి లేదా ఏప్రిల్ నాటికి పాత నోట్ల సేకరణ ప్రక్రియను పూర్తి చేస్తుంది. పాత నోట్లన్నీ ఆర్బీఐకి వెళ్లిపోయాక.. కేవలం కొత్త నోట్లు మాత్రమే మిగులుతాయి. మార్కెట్లో ఒకరకమైన నోట్లను చెలామణిలో ఉంచాలన్న లక్ష్యంతోనే ఇలా చేస్తోంది రిజర్వ్ బ్యాంక్.

ఇక రూ.10 నాణేలను మార్కెట్లో ప్రవేశపెట్టి 15 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వీటిపై పుకార్లు వస్తున్నాయని ఆర్బీఐ జనరల్ మేనేజర్ బీ. మహేష్ అన్నారు. వ్యాపారులు, సాధారణ ప్రజలు ఎవరూ వీటిని తీసుకోవడం లేదని.. చెస్ట్ బ్యాంకుల్లో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయని వెల్లడించారు. పది రూపాయల నాణులు చెలామణి అయ్యేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు సూచించారు. వీటిప ప్రజలతో పాటు వ్యాపారులకూ అవగాహన కల్పించాలని చెప్పారు. రూ.10 నాణేలను మార్కెట్‌లోకి పంప్ చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: