జాతీయ పార్టీల్లో ఒకటి అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి అతి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారు. అయితే ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి అతి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తుంది. అందుకు ముహూర్తం కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక జూన్ 1 లోగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక కాబడిన అధ్యక్షుడు బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. శుక్రవారం (జనవరి 22) ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పార్టీ నేతలు వేణుగోపాల్, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మీడియాకు వివరాలను వెల్లడించారు. జూన్ లోగా జాతీయ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని కేసీ వేణుగోపాల్ తెలిపారు. సీడబ్ల్యూసీ సమావేశంలో కొత్త అధ్యక్షుడి ఎన్నికపై వాడీవేడీగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కొంత మంది నేతలు గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఈ విషయంలో పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం. అయితే.. అలాంటిదేమీ లేదని వేణుగోపాల్ పేర్కొన్నారు.



ఈ సీడబ్ల్యూసీ సమావేశం సుహృద్భావ వాతావరణంలో కొనసాగిందని, పలు అంశాలపై కీలక చర్చ జరిగిందని నేతలు తెలిపారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో (కేరళ, తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర పార్టీల్లో మార్పులు చేపట్టడానికి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం నేపధ్యంలో ఆ ఓటమికి బాధ్యత వహిస్తూ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ పదవికి రాజీనామా చేశారు. అలాగే నాటకీయ పరిణామాల అనంతరం సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అలాగే ఆరు నెలల్లోగా పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకుంటామని నాడు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కానీ జాతీయ స్థాయిలో పార్టీకి పటిష్టమైన నాయకత్వం వహించేవారు లేకపోవడం, ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యం దృష్ట్యా పార్టీ నేతలు అసమ్మతి రాగం అందుకున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి ఎన్నికపై వాడీవేడీ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సీడబ్ల్యూసీ చర్యలు చేపట్టింది. జూన్ 1 లోగా అధ్యక్షుని ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని సంకల్పించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: