సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నేరేడుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తాళికట్టిన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. అందుకు తండ్రి, తమ్ముడి సహాయంతో హత్య చేసి ఎడ్ల బండిలో వేసుకుని వెళ్లి మరీ గ్రామ శివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలో పాతిపెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి కి చెందిన రమేష్ తాపీ మేస్త్రీ. నేరేడుపల్లి గ్రామానికి చెందిన శారదని అతడు వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కూతురు కుమారుడు ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో రమేష్ ను అత్తగారింటికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లినప్పటి నుంచి రమేష్ కనిపించకుండా పోయాడు. తన భర్త కనిపించడం లేదంటూ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో భార్య శారద ఫిర్యాదు చేసింది. అయితే నెల తర్వాత అసలు విషయం బయట పడింది. చనిపోయిన వారికి చేసే ఖర్మకాండలను శారద చేసింది.

ఇది చూసి అనుమానం వచ్చిన బంధువులు, గ్రామస్తులు నిలదీశారు. తానే చంపినట్లు అంగీకరించింది. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా రమేష్ ను తన తండ్రితో కలిసి చంపేసినట్లు శారద ఒప్పుకుంది. అనంతరం అడవిలో పాతి పెట్టినట్లు పేర్కొంది. రమేష్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భూపాలపల్లి సీఐ వాసుదేవ రావు ఆధ్వర్యంలో తమదైన శైలిలో హత్య కేసును ఛేదించారు.
 
ఇక ఈనెల 18వ తేదీన రమేష్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు వచ్చిందని దీంతో విచారణ చేపట్టినట్లు అడిషనల్ ఎస్పీ వి.శ్రీనివాసులు తెలిపారు. అయితే స్థానికుల సమాచారంతో అతని భార్యని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకుందని తన తండ్రి తమ్ముడు సహాయంతో తన భర్తను చంపి అటవీ ప్రాంతంలో పాతి పెట్టినట్లు ఒప్పుకుందని తెలిపారు. కుటుంబ కలహాల వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితురాలు శారద ఒప్పుకుందని అడిషనల్ ఎస్పీ వి.శ్రీనివాసులు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: