ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరక్కముందే రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుబడుతుండగా.. వద్దంటూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అడ్డుగా చూపిస్తూ ప్రభుత్వం కోర్టుల్లో పోరాటం చేస్తోంది. ఈ మధ్యలో ఉద్యోగులు బలైపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సెలవలపై వెళ్లారని, తోటి ఉద్యోగుల్ని ప్రలోభ పెడుతున్నారనే కారణంతో ఎన్నికల కమిషన్ లోని ఇద్దరు ఉన్నతోద్యోగులపై ఇటీవల ఎస్ఈసీ వేటు వేశారు. గతంలో తాను చేసిన సిఫార్సులను అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి కూడా ఆయన లేఖలు రాశారు. ఐఏఎస్ అధికారులు సహా.. ఉన్నతోద్యోగుల సస్పెన్షన్ వ్యవహారాన్ని మరోసారి గుర్తు చేశారు. అటు ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు, కోడ్ అమలులోకి వచ్చేసిందని చెప్పారు.

ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుపై ఆశలు పెట్టుకుంది. ఈలోగా ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్న ఆందోళన వర్ణనాతీతం. అటు ఎన్నికల కమిషన్ కి సహకరించాలా, ఇటు ప్రభుత్వానికి మద్దతు తెలపాలా అనే సందిగ్ధంలో ఉండిపోయారు. టీకా ప్రక్రియని సాకుగా చూపెడుతూ ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలని చూడటం సరికాదని కొంతమంది ఉద్యోగుల భావన. కానీ ఉద్యోగ సంఘాల నాయకుల మద్దతు మాత్రం పూర్తిగా ప్రభుత్వానికి ఉండటంతో.. సదరు నాయకులు నేరుగా ఎన్నికల కమిషన్ కి లేఖలు రాస్తున్నారు. వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు తాము ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. అటు హైకోర్టు ఎన్నికలు జరపాల్సిందేనంటూ తీర్పునిచ్చింది, ఇటు ఎన్నికల కమిషన్ పనులు మొదలు పెట్టింది, మధ్యలో ఉద్యోగులే.. ఎటూ తేల్చుకోలేక సతమతం అవుతున్నారు. ఈ పరిస్థితికి కారణం రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరేననే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో జరుగుతున్న రాజకీయాలకు ఉద్యోగుల్ని బలిపెడుతున్నారి అటు ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉద్యోగులు నిస్పక్షపాతంగా వ్యవహరించాలని సూచిస్తున్నాయి.

అటు ఉద్యోగ సంఘాల నాయకులు దూకుడు పెంచారు. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ తో భేటీ అయిన ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలు.. ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని వినతిపత్రం అందించారు. టీకాల ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని..  అప్పటివరకు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని నేతలు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: