ఏపీ రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కొన్ని రోజుల క్రితం ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. మార్చిలో పదవి నుంచి దిగిపోయే లోపల ఎలాగైనా ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ పట్టుదలగా ఉన్నారు. అయితే.. నిమ్మగడ్డ ఉన్నంతవరకూ ఎన్నికలు పెట్టేది లేదని జగన్ కూడా అంతే పట్టుదలగా ఉన్నారు. అందుకే ఈ షెడ్యూల్ పై సర్కారు కోర్టుకు వెళ్లింది. సింగిల్ జడ్డి బెంచ్‌ ఎన్నికల షెడ్యూల్‌ ను నిలిపేసింది. నిమ్మగడ్డ డివిజన్ బెంచ్‌కు వెళ్తే అక్కడ ఊరట లభించింది. ఎన్నికలు పెట్టుకోవచ్చని చెప్పింది.

అయితే దీనిపై మళ్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.. అక్కడ ఇవాళవిచారణ ఉంది. ఇంతలో నిమ్మగడ్డ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవాళ పది గంటలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇందుకు ఏమాత్రం సిద్దంగా లేదు. మరి ప్రభుత్వ సహకారం లేకుండా నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించగలరా..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శుక్రవారమంతా హైడ్రామా నడిచింది. ఎన్నికల నిర్వహణపై అటు ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్‌ ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రమేశ్‌కుమార్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదని, ఇంకా సమయం కావాలన్న ధోరణికే ప్రభుత్వం కట్టుబడి ఉంది. తొలిదశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ శనివారం ఉదయం 10 గంటలకు జారీ చేస్తామని ప్రకటించిన రమేశ్‌కుమార్‌... శుక్రవారం ఉదయం నుంచీ అందుకు తగ్గట్లుగా చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం రప్పించుకున్నారు. గత మార్చిలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అక్రమాల్ని, హింసను నివారించడంలో విఫలమయ్యారన్న కారణంతో 9 మంది అధికారుల్ని విధుల నుంచి తప్పించాలని ఆదేశించారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని విభాగాల సిబ్బందికీ కరోనా వ్యాక్సిన్‌ వేసిన తర్వాత, 60 రోజులు దాటాకే ఎన్నికలు నిర్వహించాలని అప్పటి వరకు వాయిదా వేయాలని ఎస్‌ఈసీని సీఎస్‌ లేఖలో కోరారు. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేమని, ఎస్‌ఈసీ ఆదేశించినట్టుగా అధికారులపైనా చర్యలు తీసుకోలేమని తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేవరకు ఎన్నికలపై ముందుకెళ్లొద్దనీ విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: