ఏపీ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు ఏమాత్రం సహకరించడం లేదన్న సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణపై ఆయన ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను అధికారులు చెత్త బుట్టలో పడేస్తున్నారు. దీంతో రాష్ట్ర అధికారులపై నిమ్మగడ్డ గరం గరంగా ఉన్నారు. ప్రత్యేకించి పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ తీరును నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తప్పుపట్టారు. ఎన్నిసార్లు చెప్పినా.. ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధం చేయకపోవడాన్ని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తప్పుబట్టారు.

ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటే.. తాజా ఓటర్ల జాబితా సిద్ధంగా లేకపోవడం పట్ల ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక చేసేదేమీలేక.. 2019 జనవరి 1 నాటి ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సూచించారు. తాను జాబితాను సిద్ధం చేయాలని సూచించినా ఖాతరు చేయలేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆగ్రహంగా ఉన్నారు. ఈమేరకు పంచాయతీ ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల ఓటర్ల జాబితాల విషయంపై చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు  పంచాయతీ ఎన్నికల అధికారులందరితో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఉ. 9.30 గం.కు ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలకు హాజరుకావాలని ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మీటింగ్‌కు హాజరు కావాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ను ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కోరారు.

అయితే ఈ మాటలను మాత్రం అధికారులు ఎంత వరకూ లెక్కపెడతారోనన్నది అనుమానమే. సాధారణంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే.. రాష్ట్ర వ్యవస్థ అంతా ఎన్నికల కమిషనర్‌ చెప్పినట్టు నడుచుకోవాలి. కానీ..ఏపీలో జగన్‌కూ నిమ్మగడ్డకూ మధ్య వ్యక్తిగత స్థాయికి వివాదం ముదరడం వల్ల నిమ్మగడ్డ మాటను ఎవరూ లెక్క చేయడం లేదు. ప్రత్యేకించి సీఎస్‌, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు ఆయన్ను పట్టించుకోవడం లేదు. నిన్న మీటింగ్ ఉందని రమ్మని పిలిస్తే.. డుమ్మా కొట్టేశారు. నిమ్మగడ్డ మెమో ఇచ్చినా లైట్ గా తీసుకున్నారు. ఇవాళైనా వెళ్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: