టెక్నాలజీ పెరిగినా ఇంకా పాత పద్ధతినే ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలోని అతి ముఖ్యమైన ఆలయం అని పేరున్నా కూడా.. కనీసం దర్శన టికెట్లపై బార్ కోడ్ కూడా లేని పరిస్థితి. అందుకే బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో దర్శనాల విషయంలో ఇంకా అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. సిబ్బంది చేతివాటం, అధికారుల నిర్లక్ష్యం వెరసి.. టికెట్ల ఇంద్రకీలాద్రిపై టికెట్ల దందా సాగుతోంది.

భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో టికెట్ ను చించి, అది తిరిగి వారికే ఇస్తుంటారు. దీంతో టికెట్లను రీసైక్లింగ్ చేసే ముఠా పని సులువు అవుతోంది. రద్దీగా ఉన్న సమయంలో భక్తులను పక్కకు పిలిచి పాత టికెట్లు అమ్మడం, లేదా కౌంటర్ లోనే తమకు చెందినవారిని పెట్టుకుని, పాత టికెట్లు అమ్మించడం యథేచ్ఛగా సాగుతోంది. విజయవాడ వన్‌ టౌన్ కు చెందిన నలుగురు వ్యక్తులు ఇలా పాత టిక్కెట్లను భక్తులకు అమ్ముతుండగా దేవస్థానం భద్రతా సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించారు. ముగ్గురు పారిపోగా దొరికిన ఒకరిని పోలీసులలకు అప్పగించారు. అయితే దేవస్థానం నుంచి రాతపూర్వక ఫిర్యాదు లేకపోవడంతో అతడిని మందలించి పంపించేశారని తెలుస్తోంది.

అక్రమార్కులు చెలరేగిపోవడానికి పరోక్షంగా అధికారులే కారణం అనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. బృందాలుగా వచ్చే భక్తులతో మాట్లాడుకుని.. దర్శనాలు చేయిస్తామంటూ వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్న ముఠాలు కొండపై ఉన్నాయని అంటున్నారు. కొందరు దేవస్థానం సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా దర్శనాలు చేయిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

భక్తులకు ఇచ్చే టిక్కెట్లకు సంబంధించి కౌంటర్‌ ఫైల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఇలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదనేది భక్తుల వాదన. ప్రస్తుతం భక్తులు తెచ్చే టిక్కెట్ ‌ను చింపి.. తిరిగి వాళ్లకే ఇచ్చేస్తున్నారు. ఇలాకాకుండా.. టిక్కెట్‌ ను చింపిన తర్వాత సగాన్ని గేటు దగ్గర ఉన్న సిబ్బంది వద్దే ఉంచుకుని, మిగతా సగాన్ని భక్తులకు ఇచ్చేయాలి. అలా చేస్తే రెండింటిపైనా ఒకటే సీరియల్ నెంబర్ ఉంటుంది. అప్పుడే.. ఎన్ని టిక్కెట్లు వచ్చాయి. వాటిలో నకిలీవి ఉన్నాయా? పాతవి మళ్లీ తెస్తున్నారా? ఇలాంటివన్నీ తెలిసిపోతాయి. కానీ.. అధికారులు కౌంటర్‌ ఫైల్‌ను భద్రపరిచే ఏర్పాటు చేయడం లేదని అందుకే అక్రమార్కులు చెలరేగిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: