రాజ‌కీయంగా దూకుడు చూపించాల‌నే లక్ష్యంతో ఉన్న కాపుల‌కు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం విష‌యంలో అనేక సందేహాలు ముసురుకున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. ముద్ర‌గ‌డ‌తో భేటీ అయి.. బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీలోకి వెళ్లేందుకు స‌మాలోచ‌న‌లు జ‌రిపారు. ఈ క్ర‌మంలో త‌న‌కు స‌న్నిహితంగా ఉన్న బీసీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారితో చ‌ర్చించారు. ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.. కీల‌క‌మైన ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని కాపులు.. ప‌ద్మ‌నాభం వెంట న‌డిచేం దుకు ఎక్క‌డా ఉత్సాహం క‌న‌బ‌ర‌చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో ముద్ర‌గ‌డ‌ను న‌మ్ముకుని.. కాపులు ఆయ‌న వెంట‌న‌డిచారు. ఈ క్ర‌మంలో టీడీపీ స‌ర్కారు నుంచి నిర్బంధాలు సైతం ఎదుర్కొన్నారు.

కాపుల రిజ‌ర్వేష‌న్ విష‌యంలో ముద్ర‌గ‌డ దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్ల‌తో కాపులకు ఆశ‌లు రేకెత్తించారు. అయితే.. దానిని సాధించ‌లేక పోయారు. పోనీ.. ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత అయినా.. ఆయ‌న పోరు కొన‌సాగించారా? అంటే.. అది కూడా లేదు. పైగా కాపు ఉద్య‌మం నుంచి నేరుగా ఆయ‌న త‌ప్పుకొన్నారు. ఈ ప‌రిణామాల‌పై కాపులు తీవ్ర ఆవేద‌న‌తో పాటు.. ముద్ర‌గ‌డ‌పై విశ్వాసం కూడా కోల్పోయారు. తాము ఆయ‌న‌ను ఎంతో న‌మ్మామ‌ని, ఏదైనా సాధించి తీరుతార‌ని భావించామ‌ని, కానీ, ఇలా వెన్ను చూపిస్తార‌ని అనుకోలేద‌ని ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కాపులు పేర్కొంటున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్పుడు రాజ‌కీయంగా ఆయ‌న‌ను ఎలా న‌మ్ముతామ‌నేది కాపుల ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతానికి కాపుల‌కు ఒక రాజ‌కీయ నాయ‌కుడుతోపాటు వేదిక కూడా అవ‌స‌ర‌మే. అయితే.. స‌రైన నాయ‌కుడు, స‌రైన వేదిక ల‌భించ‌డం లేద‌ని.. ముద్ర‌గ‌డ‌ను న‌మ్ముకుంటే.. మ‌రింత గా కాపు స‌మాజానికి ఇబ్బందులు త‌ప్ప‌.. మ‌రేమీ ద‌క్కే ప‌రిస్థితి ఉండ‌ద‌ని వీరు అంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో కాపులు ముద్ర‌గ‌డ‌కు దూరంగా ఉన్నారు. బీసీ నాయ‌కులు కూడా ఒక్క రిజ‌ర్వేష‌న్ విష‌యంలో త‌మ అభిప్రాయ‌మే చెల్లాల‌నే డిమాండ్‌ను తెర‌మీదికి తెస్తున్నారు. ఈ విష‌యంలో ప‌ట్టుబ‌డితే.. త‌మ దారి తాము చూసుకునేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్ర‌మంలో కాపుల‌కు ముద్ర‌గ‌డ‌కు మ‌ధ్య దూరం నానాటికీ పెరుగుతోంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: