ఏపీలో అధికార ప్రతిపక్షాల పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పుడే స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా రిలీజ్ కావ‌డంతో ఈ రెండు పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలే పేలుతున్నాయి. ఒక‌రి అవినీతిని మ‌రొక‌రు బ‌య‌ట పెట్టుకుంటున్నారు. కొద్ది రోజుల క్రింద‌టే తూర్పు గోదావ‌రి జిల్లాలో బిక్క‌వోలు ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి ఆల‌యంలో ఎమ్మెల్యే స‌త్తి రామ‌కృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే న‌ల్లిమిల్లి రామ‌కృష్ణా రెడ్డి ప్ర‌మాణాల‌కు దిగారు. ఆ త‌ర్వాత విశాఖ జిల్లాలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణపై చెలరేగిన అవినీతి ఆరోపణల వివాదంలో ఎమ్మెల్యే వెల‌గ‌పూడి వ‌ర్సెస్ ఆయ‌న‌పై పోటీ చేసి ఓడిన వైసీపీ నేత అక్క‌ర‌మాని విజ‌య నిర్మ‌ల మ‌ధ్య ప్ర‌మాణాలు కొన‌సాగాయి.

ఇక తాజాగా ఇప్పుడు ఈ ఆరోప‌ణ‌ల‌ వంతు క‌డ‌ప జిల్లాకు పాకింది. బ‌న‌గాన‌ప‌ల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధాన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. 2014లో రామిరెడ్డిపై జ‌నార్థ‌న్ రెడ్డి విజ‌యం సాధించారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో జ‌నార్థ‌న్ రెడ్డి ఓడిపోగా.. కాట‌సాని రామిరెడ్డి విజ‌యం సాధించారు. జ‌నార్థ‌న్ రెడ్డి మొత్తంగా 22 కేసుల్లో నిందితుడిగా ఉన్నార‌ని ఆరోపించిన రామిరెడ్డి.. ఆయ‌న ఓ భూ క‌బ్జాదారుడు అని ... ఆయ‌న‌పై ఉన్న కేసుల‌ను కావాలంటే ఎఫ్ ఐ ఆర్ లో కూడా చూపిస్తాన‌ని స‌వాల్ విసిరారు.

ప్ర‌స్తుతం బ‌న‌గాన‌ప‌ల్లెలో ఆయ‌న ఉంటోన్న ఇళ్లు కూడా క‌బ్జా చేసిందే అని విమ‌ర్శించారు. త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు జ‌నార్థ‌న్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను కూడా ఆక్ర‌మించి రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్లు వేసిన ఘ‌న‌త కాట‌సానిదే అని మండి ప‌డ్డారు. ప్ర‌తి రియ‌ల్ వెంచ‌ర్ నుంచి కూడా ఆయ‌న క‌మీష‌న్లు దండుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు.

ఎవ‌రైనా ఎమ్మెల్యే అక్ర‌మాల‌ను ఎత్తి చూపితే వారిపై అక్ర‌మ కేసులు పెడ‌తాన‌ని బెదిరిస్తున్నారంటూ జ‌నార్థ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై తాను ఓపెన్ చ‌ర్చ‌కు సిద్ధంగా ఉన్నాన‌ని.. ద‌మ్ముంటే ఆయ‌న త‌న‌తో చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు. వీరిద్ద‌రి స‌వాళ్ల‌తో బ‌న‌గాన‌ప‌ల్లె రాజ‌కీయం వేడెక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: