ఏపీలో పంచాయితీ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. పంచాయితీ ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు వద్దని జగన్ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు సుప్రీం కోర్టుకు వెళ్ళాయి. అయితే సుప్రీంలో తీర్పు వచ్చేవరకు ఎన్నికల విధుల్లో పాల్గొనమని ఉద్యోగ సంఘాలు తేల్చేసాయి. అయితే ఎవరెన్ని చెప్పినా నిమ్మగడ్డ మాత్రం ఎన్నికల నిర్వహణలో ముందుకెళ్లిపోతున్నారు.

అయితే సుప్రీంలో కూడా నిమ్మగడ్డకు అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశాలున్నాయని చర్చలు జరుగుతున్నాయి. అందుకే రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమైపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అధికార వైసీపీ నేతలు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటు టీడీపీ కూడా అదే పనిలో ఉంది. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉంది.

ఈ క్రమంలోనే చంద్రబాబు సైతం పార్టీ నేతలకు సూచనలు కూడా ఇస్తున్నారు. అయితే తాము బలంగా ఉన్నచోట సత్తా చాటి వైసీపీని చిత్తు చేయాలని నేతలకు బాబు చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నచోట వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఎప్పటి నుంచో పార్లమెంట్ పరిధిలో వర్క్ చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు టీడీపీ శ్రేణులని యాక్టివ్ చేస్తున్నారు. అయితే తన బాబాయ్, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంటే, రామ్మోహన్ శ్రీకాకుళం జిల్లాలో గట్టిగా కష్టపడుతున్నారు. తన పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జెండా మెజారిటీ స్థానాలు ఎగరవేయాలని చూస్తున్నారు.

అయితే అధికార వైసీపీకి చెక్ పెట్టడం అంత సులువు కాదు. కానీ శ్రీకాకుళంలో టీడీపీ బలంగానే ఉంది. రామ్మోహన్, అచ్చెన్నాయుడు, గౌతు శిరీష, గుండా లక్ష్మీ, కూన రవికుమార్, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, కలపట వెంకటరమణ లాంటి టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. జిల్లాలో పరిస్తితి చూస్తుంటే టీడీపీ, వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఏదేమైనా రామ్మోహన్‌తో వైసీపీకి ఇబ్బందే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: