కొడాలి నాని...ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న నాయకుడు. రెండుసార్లు టీడీపీ నుంచి, రెండుసార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాని, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. గతంలో రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచినప్పుడు నాని అధికారంలో లేరు. అలాగే 2014లో వైసీపీ నుంచి గెలిచినప్పుడు కూడా అధికారంలో లేరు. కానీ 2019 ఎన్నికల్లో మరోసారి వైసీపీ నుంచి గెలవడం, జగన్ సీఎం అవ్వడం జరిగాయి.

దీంతో నానికి అధికారంతో పాటు మంత్రి పదవి కూడా వచ్చింది. అయితే నాని పక్కా మాస్ నాయకుడు. రాష్ట్రంలో టాప్ మాస్ నాయకుల్లో ఈయన కూడా ఒకరు. జనంకు అర్ధమయ్యే బాష మాట్లాడుతూ, జనంతో కలిసిపోయే నాయకుడు. అయితే అధికారంలోకి వచ్చాక నాని, ప్రతిపక్ష నేత చంద్రబాబుని ఓ ఆట ఆడుకుంటున్నారు. అలాగే ఆయన తనయుడు నారా లోకేష్‌పై సెటైర్లు వేస్తారు. ఇంకా తన చిరకాల రాజకీయ శత్రువు దేవినేని ఉమాకైతే చుక్కలు చూపిస్తారు.

అయితే ఇలా రాజకీయ ప్రత్యర్ధులని టార్గెట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నాని మరీ బూతులతో ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తారు. ఈ విషయంపైనే చాలావరకు చర్చ జరుగుతుంది. సాధారణంగా నాని మాట్లాడే బాష గ్రామీణ ప్రాంత ప్రజలకు కొత్త కాదు. కానీ చదువుకున్నవారికి, పార్టీల వారీగా లేని ప్రజలకు ఇబ్బందే అని పరిశీలకులు అంటున్నారు. నాని లాంగ్వేజ్ వల్ల రాష్ట్ర స్థాయిలో వైసీపీకి లాభం కంటే నష్టం జరగొచ్చని మాట్లాడుతున్నారు.

గత ఎన్నికల్లో న్యూట్రల్‌గా ఉండేవారు కూడా జగన్‌కు ఓటు వేశారని, కానీ ఇలాంటి బాష వల్ల వారు ఒపీనియన్ మార్చుకోవచ్చని చెబుతున్నారు. అయితే నానికి సొంత నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే నాని ఏంటో అక్కడి ప్రజలకు బాగా తెలుసని, పెద్దోడు అయినా, పేదోడు అయినా నాని పలకరింపు ఒకేలా ఉంటుందని, కాబట్టి గుడివాడలో నానికొచ్చే ఇబ్బంది ఏం లేదని అంటున్నారు. కాకపోతే రాష్ట్ర స్థాయిలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: