ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమైన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు చుక్కెదురైంది. ఈ భేటీకి హాజరుకావాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ.. ఏపీ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరుకాలేదు. మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ సమావేశం ఉంటుందని ఎస్ఈసీ అధికారులు ముందుగానే వీరికి సమాచారం అందించారు. ఈ భేటీకి హాజరుకాని అధికారులు తీరుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏ విధంగా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు జిల్లాలకు సంబంధించిన అధికారులు సైతం ఈ భేటీకి హాజరుకాలేదని తెలుస్తోంది. తమకు సహకరించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా.. అధికారులు స్పందించకపోవడాన్ని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి ఏపీ గవర్నర్‌తోపాటు కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం తొలివిడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు వస్తే తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్ ప్రతిపాదికగానే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన 11 జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి విడతకు జనవరి 25 నుంచి నామినేషన్ల స్వీకరించనుండగా.. ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఎన్నికల జాబితా సకాలంలో అందించడంలో పంచాయతీరాజ్ అధికారులు విఫలమయ్యారని ఆయన అన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికలపై సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని.. సీఎస్, డీజీపీ సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని కోరుతున్నామని ఎస్ఈసీ అన్నారు.

ఎన్నికలు సకాలంలో నిర్వర్తించడం ఎన్నికల కమిషన్ విధి అని తెలిపారు. ఎన్నికల సంఘానికి నిధులు, సిబ్బంది కొరత వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సరైనా పరిష్కారం లభించలేదని.. అందుకే కోర్టును ఆశ్రయించామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో తక్కువ మందే ఉన్న సమర్ధవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల నిర్వహణ తమకు పెను సవాలేనని అన్నారు. దేశమంతటా ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో వద్దనడం సరికాదని వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాలు భిన్నవాదనలు వినిపించాయని చెప్పారు. ఏకగ్రీవ ఎన్నికపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఐజీ స్థాయి అధికారితో పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎన్నికల సక్రమ నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: