అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఈ ఎన్నికలు ఎలాగైనా ఆపాలని వైసీపీ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో ఎన్నికలు ఎలాగైనా నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ట్రై చేస్తున్నారు. ఈ రెండు వర్గాలూ స్థానిక ఎన్నికల విషయమై హైకోర్డులో పలుమార్లు వాదనలు వినిపించాయి. తొలుత ఎన్నికలు నిర్వహించడానికి కరోనా మహమ్మారి అడ్డుగా ఉందని వైసీపీ సర్కారు వాదించింది. అయితే ఈ వాదనలో పస లేదని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఈ క్రమంలో హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఎన్నికలు నిలిపి వేయాలని ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్ వ్యాక్సినేషన్ కు అడ్డొస్తుందని న్యాయమూర్తి భావించారు. అయితే ఈ తీర్పును ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఇరువర్గాల వాదనలూ విన్నది.

ఆపై ఎన్నికలు ఎందుకు వద్దంటున్నారో ఎలక్షన్ కమిషన్‌ కు ప్రభుత్వం తరఫున ఓ ప్రతినిధి వెళ్లి వివరించాలని చెప్పింది. అదే సమయంలో ఎన్నికలు నిర్వహణ ఆవశ్యకతను ప్రభుత్వానికి వివరించాలని ఎలక్షన్ కమిషన్ కు కూడా తెలిపింది. అయినా సరే ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై వైసీపీ వర్గాల నుంచి, వారి అనుయాయుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రాణాపాయం వస్తే ఎదుటివారి ప్రాణాలు తీసేహక్కు రాజ్యాంగం ఇచ్చిందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన నిమ్మగడ్డ.. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఓ లేఖ రాశారు. ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.  వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. చంపుతానని వెంకట్రామిరెడ్డి బెదిరించారని తెలిపారు. వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని కోరారు. దీనిపై డీజీపీ ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: