నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జ‌యంతిని పుర‌స్కరించుకొని కోల్‌క‌తాలోని విక్టోరియా మెమోరియ‌ల్‌లో కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా పాల్గొన్నారు. ప్రధాని కోల్కతా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. నేజాతీ జయంతి కార్యక్రమంలో భాగంగా మ‌మ‌తా బెన‌ర్జీని మాట్లాడాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు. ఆమె ప్రసంగించడానికి సిద్ధం కాగానే సభకు హాజరైన కొంత మంది జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఆమె ప్రసంగించకుండా అడ్డుతగిలారు. ఈ పరిణామం మమతా బెనర్జీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
  దీంతో ఆహ్వానించి అవ‌మనిస్తారా.. అంటూ మమతా బెనర్జీ మండిప‌డ్డారు. ‘ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా గౌర‌వంగా జ‌రగాలి. ఇదేమీ పార్టీ ప్రోగ్రామ్ కాదు. ఒక వ్యక్తిని మాట్లాడ‌మ‌ని ఆహ్వానించి, వారి ప్రసంగం వినిపించ‌కుండా గోల చేయ‌డం మంచి ప‌ద్ధతి కాదు. నాకు జ‌రిగిన అవ‌మానానికి నిర‌స‌న‌గా నేను ఈ కార్యక్రమంలో ఏమీ మాట్లాడ‌ను’ అంటూ మ‌మ‌తా బెన‌ర్జీ త‌న స్థానానికి వెళ్లి కూర్చుకున్నారు. వేదికపై ఉన్న ప్రధాని మోదీ ఇదంతా గమనిస్తూ కూర్చున్నారు. త‌న‌కు అవ‌మానం జ‌రిగింద‌ంటూ మ‌మ‌త బెనర్జీ ఆరోపిస్తున్నప్పుడు కూడా ప్రధాని ఎలాంటి హావ‌భావాలు వ్యక్తం చేయకుండా సైలెంట్ గానే ఉన్నారు.
 
                                             బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం పెరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణ, తదనంతర పరిణామాల నేపథ్యంలో వివాదం తారాస్థాయికి చేరుకుంది. మమతా బెనర్జీ ఒకే వేదికను పంచుకోవడం, కార్యక్రమంలో మమతకు చేదు అనుభవం ఎదురవడం చర్చనీయాంశాలుగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: