ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించదని తెలిసి కూడా ఎన్నికలు పెట్టేందుకే నిర్ణయించారు. ఈ మేరకు నాలుగు దశల ఎన్నికలకు నోటిఫికేషన్, షెడ్యూల్ ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో మాట్లాడాలని భావించారు. దీనికి వీడియో కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసారు. అయితే ఏ ఒక్క అధికారి కూడా వీడియో కాన్ఫరెన్సుకు రాలేదు.

పైగా ఉద్యోగ సంఘాలు నిమ్మగడ్డ తీరును దారుణంగా తప్పుబట్టాయి. అయితే.. ఇక్కడ నిమ్మగడ్డ చేసిన ఓ తప్పు వారి పాలిట అస్త్రంగా మారింది. అందేంటంటే.. నిమ్మగడ్డ ప్రెస్ మీట్‌ నిర్వహించే సమయంలో తన టేబుల్‌ చుట్టూ గ్లాస్‌ ఏర్పాటు చేసుకున్నారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు ఈ జాగ్రత్త తీసుకున్నారు. మాస్క్ పెట్టుకుని వచ్చారు. కరోనా గురించి ఆయనే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. మా పరిస్థితి ఏంటంటూ ఉద్యోగ సంఘాలు గళమెత్తాయి. వైసీపీ నేతలు కూడా అదే వాదన వినిపిస్తున్నారు.

ఇక సర్కారు ఛానల్ సాక్షి నిమ్మగడ్డ షీల్డ్ గ్లాసు పెట్టుకున్న విషయాన్ని రోజంతా ప్రసారం చేసింది. దీంతో నిమ్మగడ్డపై ఉద్యోగ సంఘాలు, వైసీపీ నాయకుల విమర్శలకు బలం చేకూరింది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్ స్వామిభ‌క్తి చూపుతున్నార‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విమ‌ర్శించారు. చంద్రబాబు హ‌యాంలో ఎస్ఈసీగా నిమ్మగ‌డ్డకు అవ‌కాశం వ‌చ్చింద‌ని.. అందుకే టీడీపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు.

నిమ్మగడ్డ సుప్రీంకోర్టులో తీర్పు రాకముందే పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేషన్ ఇచ్చార‌ని త‌ప్పుప‌ట్టారు. వాక్సినేషన్‌ పూర్తి కాకుండానే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పును బట్టి ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.  రాష్ట్రంలో చంద్రబాబు కుట్రల‌కు పాల్పడుతున్నార‌ని ఆరోపించారు నిమ్మగ‌డ్డ ర‌మేష్ తీరు స‌రిగా లేద‌ని మంత్రి త‌ప్పుప‌ట్టారు. ఆయనవి ప్రాణాలు కాని ఉద్యోగులవి కావా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: