ఏపీలో జగన్ సర్కార్ పాలన తీరు పట్ల కేంద్రం సీరియస్ గా ఉందని బీజేపీ అగ్ర నేత ఒకరు చెప్పడం అంటే ఇది విశేష పరిణామంగానే చూడాలి. ఏపీలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కేంద్రం నిశితంగా గమనిస్తోందని ఆయన అంటున్నారు.

ఆ సీనియర్ నేత ఎవరో కాదు, ఈ మధ్య దాకా బీజేపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రామ్ మాధవ్. ఆయన తాజాగా విశాఖ పర్యటనలో జగన్ సర్కార్ మీద చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఏపీలో వరసగా దేవతా విగ్రహాల మీద దాడులు జరుగుతున్నా జగన్ సర్కార్ కనీసంగా కూడా పట్టించుకోవడంలేదని విమర్శించారు.

దేవతా విగ్రహాలు అంటే వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు. ఒక విధంగా హిందూ ధర్మం లో దేవతా విగ్రహాలకు ఎనలేని పవిత్రత ఉంటుదని కూడా చెప్పారు. అటువంటిది ఏపీలో వరసగా జరుగుతున్న ఈ దాడుల మీద ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రామ్ మాధవ్ అంటున్నారు. ఇప్పటిదాకా కనీసం దోషులను అరెస్ట్ చేయలేదని నిందించారు.

ఈ నేపధ్యంలో  ఏపీలో జరుగుతున్న పరిణామాలను  కేంద్రం సీరియస్ గానే గమనిస్తోందని  ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి వైసీపీ సర్కార్ చూడడం  మంచి విధానం కాదని ఆయన అన్నారు. ఒక్కసారి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక ఎన్నికల సంఘం పరిధిలోకే  అంతా వస్తుందనిక్ ఎన్నికల సంఘాన్ని ఎదిరించడం కూడా ఎవరికీ  మంచి విధానం కాదని ఆయన అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో జగన్ పాలన మీద రామ్ మాధవ్ తనదైన శైలిలో గట్టిగానే మాట్లాడారు.  కేవలం వ్యక్తిగత ప్రతిష్ట కోసమే జగన్ ఇలా చేస్తున్నారు అని కూడా రామ్ మాధవ్ నిందించారు. ఏపీ విషయంలో చూస్తే అభివృద్ధి ఎక్కడా జరగడంలేదని, కేవలం రాజకీయం మాత్రమే కనిపిస్తోందని రామ్ మాధవ్ హాట్ కామెంట్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: