ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పంచాయతీ ఓ పట్టాన ఆగేలా లేదు. చిలికి చిలికి గాలి వానలా మారిన ఈ ఎన్నికల సమరం ఇంకెన్ని విమర్శలకు ప్రతి విమర్శలకు దారితీస్తుందో తెలియడం లేదు అంటున్నారు రాజకీయ మేధావులు. తాజాగా ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల కొరకు తొలివిడత నామినేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నామినేషన్లు విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ  సంచలన వ్యాఖ్యలు చేశారు.

 కేరళ రాష్ట్రాన్ని ఉదాహరణగా చెబుతూ ఇటువంటి ఆపత్కాల సమయంలో ఎన్నికలు జరపడం ఎంతవరకు సమంజసమో  గుర్తించాలన్నారు. కేరళలో ఒకానొక సమయంలో కరోనా కేసులు సింగిల్ డిజిట్‌కు వచ్చాయని. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన అనంతరం కరోనా కేసులు భారీగా పెరిగాయని ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో జనాలు పెద్ద ఎత్తున ఒక దగ్గరకు చేరడానికి మనమే సహకరించడం సరికాదన్నారు. ఎన్నికల గురించి నిన్న ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జరుగగా ఆ  సమావేశానికి సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి రాకపోవడం చూస్తేనే దీనిపై వారికి ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతోంది.

అటు ఉద్యోగ సంఘాల నేతలు సైతం కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం ప్రమాదకరమని అరచి గీ పెడుతున్నా ఎస్ఈసీ పట్టించుకోవడం లేదని, వీరికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఎన్నికలు జరపాలనే పట్టుదలతో మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అంటూ మండిపడుతున్నారు. మరోవైపు ఏపీ సర్కారు సైతం ఎన్నికలు జరిగితే ప్రమాదం పెరిగే అవకాశం  ఎక్కువగా ఉందని ఏక కంఠంతో పలుకుతోంది. మరోవైపు సుప్రీం కోర్టు నుండి ఎలాంటి నిర్ణయం రాబోతుందని ఆసక్తి నెలకొంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: