ఎమ్మెల్సీ ఎన్నిక‌ల రేసులో హ‌స్తం పార్టీ వెన‌క‌బ‌డిన‌ట్లుగా స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీకి అభ్య‌ర్థుల‌నే ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అటు టీఆర్ ఎస్‌, ఇటు బీజేపీతో పాటు టీజేఎస్‌, యువ‌తెలంగాణ‌, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ప్ర‌చారంలో దూసుకెళ్తున్నా... చేతి గుర్తు పార్టీలో ఇంకా అభ్య‌ర్థుల‌పై మ‌ల్ల‌గుల్లాలు జ‌రుగుతుండ‌టంపై సొంత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లే పెద‌వి విరుస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి చిన్నారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి రాములునాయక్ పేర్లు దాదాపు ఖరారు అయిందని ప్రచారం జరిగినా ఇన్‌ఛార్జి టూర్‌తో సీను మారిందన్న చర్చ కూడా నడుస్తోంది. అటు- బీజేపీలో మాత్రం ఎక్కడ లేని ధీమా కనిపిస్తోంది. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తోంది.


రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై హస్తం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. వాస్త‌వానికి అందరికంటే ముందుగానే ప్రకటిస్తామని హడావిడి చేసినా అమ‌ల్లోకి రాలేదు.  కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌లో వెనుకడుగు వేయడంలో ఆంతర్యం ఏమిటన్న చర్చ ఇప్పుడు పార్టీ శ్రేణుల మ‌ధ్య పెద్ద ఎత్తున జ‌రుగుతోంది.కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల  ఇన్‌చార్జ్ మాణిక్యం ముందు సీనియర్లు ఉంచిన ఓ ప్రతిపాదన వల్ల ఎంపిక కమిటీని నియమించాల్సి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ జన సమితి నుంచి కోదండరామ్‌ పోటీ చేస్తుండడంతో ఆయనకు మద్దతు ఇవ్వాలని కొందరు పార్టీ నేతలు ప్రతిపాదించారట. కోదండకు బయట నుంచి మద్దతు ఇచ్చి గెలిపించాలన్న ఆలోచనలో ఉన్న హస్తం పార్టీలోని కొందరు నేతలు ఇప్పటికే ప్రతిపాదించిన రాములునాయక్‌ను బుజ్జగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చే నెల 18వ తేదీలోగా షెడ్యూల్‌ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు పట్టభద్రుల ఓటర్ల తుది జాబితా విడుదలైంది.  రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ నియోజకవర్ల పట్టభద్రుల ఓట రు జాబితాను ప్రకటించింది. అలాగే వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ఈ నెల18న విడుదల చేసింది. ఈ నియోజకవర్గంలో 4,91,396 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 3,23,457, మహిళలు 1,67,859, ఇతరులు 80 మంది ఉన్నారు. నామినేషన్లకు 10 రోజుల ముందు వరకు పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. ప్రస్తుత ఓటరు జాబితాను పరిశీలిస్తే 2015లో ఉన్న ఓటర్ల కంటే సగం వరకు పెరుగుదల నమోదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: