జనసేన అధినేత పవన్ కల్యాణ్...గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేని జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు, స్థానిక సమస్యలపై ప్రశ్నించాడు. అయితే ఇలా ఎమ్మెల్యేని నిలదీసిన వెంగయ్య ఆ తర్వాత రెండురోజుల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

అయితే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు, వైసీపీ నేతలు మానసికంగా హింసిస్తేనే వెంగయ్య చనిపోయాడని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై పవన్ సైతం ఒంగోలులో వెంగయ్య కుటుంబంతో కలిసి మీడియా సమావేశం పెట్టి మరీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. వెంగయ్య మృతికి కారణమైన ఏ ఒక్కరినీ వదలమని, ఎమ్మెల్యేని అధః పాతాళానికి తోక్కేస్తామని హెచ్చరించారు.

ఇక పవన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కూడా స్పదించి, తాను తప్పు చేస్తే శిక్షకు రెడీ అని, అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని, పవన్, తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే డైరక్ట్‌గా వెంగయ్య మృతిపై వివరణ ఇచ్చినట్లు కనిపించడం లేదు. ఏదో పవన్‌ని పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్‌లు విసురుతున్నారు. అయితే ఎమ్మెల్యే ఇలా డైరక్ట్‌గా రాజీనామా చేస్తానని చెప్పడానికి కారణం లేకుండా లేదు. 2019 ఎన్నికల్లో జగన్ తర్వాత అత్యంత భారీ మెజారిటీతో గెలిచింది అన్నా రాంబాబే.

దాదాపు 80 వేల పైనే మెజారిటీతో రాంబాబు విజయం సాధించారు. పైగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆ ధైర్యంతోనే రాంబాబు పదవికి రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసురుతున్నారు. అయితే రాంబాబు గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చిరంజీవి, పవన్ సపోర్ట్‌తోనే 2009 ఎన్నికల్లో గెలిచారు. ఇక 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలోచ్చేసరికి వైసీపీలోకి వచ్చి విజయం సాధించారు. ఇక ఇక్కడ జనసేనకు అంత బలం లేదు. అందుకే రాంబాబు ధీమాగా సవాళ్ళు విసురుతున్నారు. అయితే పవన్ డైరక్ట్ పోటీలో దిగితే ఫలితం వేరేగా ఉండొచ్చు. కానీ ఈ సవాళ్ళు అన్ని వర్కౌట్ అవ్వడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: