రోజా...ఏపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలు. సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన రోజా, టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో నగరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2009లో చంద్రగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. ఇలా రెండుసార్లు ఓడిపోయిన రోజాకు టీడీపీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. దీంతో రోజా వైసీపీలోకి వచ్చి, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అయితే స్వల్ప మెజారిటీలతోనే రోజా గెలిచారు.

ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో రోజా దూసుకెళుతున్నారు. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. అయితే ఈ మధ్య రోజా కాస్త ఇబ్బందుల్లో పడ్డారు. అది కూడా ప్రతిపక్ష టీడీపీ వల్ల కాదు. సొంత పార్టీ వైసీపీ వల్లే. తనకు సొంత జిల్లా చిత్తూరులో సరైన గౌరవం దక్కడం లేదని ప్రివిలేజ్‌ కమిటీ ముందే బాధపడ్డారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పారు.

అలాగే సొంత నియోజకవర్గం నగరిలో సైతం సొంత పార్టీ వల్లే పెద్ద తలనొప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ జిల్లా మంత్రులు రోజా ప్రమేయం లేకుండానే పెత్తనం చేస్తున్నారని తెలిసింది. ఈ విషయంలో రోజా పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా మాజీ మంత్రి రెడ్డి వారి చెంగారెడ్డి సోదరుడు చక్రపాణి రెడ్డి నగరిలో బాగా హడావిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.  రోజాకు ప్రత్యామ్నాయంగా ఆయన కార్యక్రమాలను చేస్తున్నారు. పైగా రోజాకు అనుకూలంగా ఉన్న అధికారులని సైతం పక్కనబెట్టెస్తున్నారని టాక్.

పెద్దిరెడ్డి అండతోనే చక్రపాణి నగరిలో పనిచేస్తున్నారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. రోజాను ఒంటరి చేసేందుకే ఇదంతా జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. అందుకే రోజా సైతం ఈ విషయంపై పలుసార్లు వైసీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రివిలేజ్‌ కమిటీ ముందు కూడా తనకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే నగరిలో రోజాకు సొంత పార్టీ వాళ్లే చెక్ పెట్టేలా ఉన్నారు. కానీ సొంత ఇమేజ్ ఉన్న రోజాకు చెక్ పెట్టడం అంత సులువైన పని కాదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: