ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోరుపై అనేక ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేమని జగన్ ప్రభుత్వం చెబుతుంది. అటు ఉద్యోగ సంఘాలు సైతం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేరు.

అయితే నిమ్మగడ్డ మాత్రం తన పని తాను చేసుకెళుతున్నారు. ఇక సుప్రీం తీర్పుపై ఆధారపడి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్తితి బట్టి చూస్తే, సుప్రీంలో కూడా నిమ్మగడ్డకు అనుకూలంగానే తీర్పు వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అధికార వైసీపీ సైతం కూడా అంతర్గతంగా ఎన్నికలకు సిద్ధమవుతుంది.

ఇక పంచాయితీ ఎన్నికల తర్వాత, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లో అధికార వైసీపీకే మెజారిటీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. దాదాపు 70 శాతంపైనే సీట్లు వైసీపీ ఖాతాలోనే పడొచ్చని తెలుస్తోంది. వైసీపీ నేతలైతే 90 శాతం స్థానాలు గెలవాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇవ్వాలని సిద్ధం అవుతుంది. ఇప్పటికే టీడీపీ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది.

ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఎదురైతేనే బాగుంటుందని కొందరు వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇప్పుడు టఫ్ ఫైట్ ఎదురైతేనే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సెట్ అవుతారని, లేదంటే ఎక్కువ స్థానాలు గెలిస్తే ఎమ్మెల్యేలకు గర్వం ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం సీట్లు, ప్రతిపక్షాలకు 50 సీట్లు వస్తే అప్పుడు రాజకీయం బాగుంటుందని, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఇంకా ఎక్కువ కష్టపడతారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: