తెలంగాణ ముఖ్యమంత్రి పదవి అదే అధికారపీఠం మార్పుపై ఇటీవల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ప్రచారంలో ఎలాంటి అనుమానం లేదు 100 శాతం నిజం. అయితే అధికారపీఠం మార్పు మాత్రమే కాదు, కేసీఆర్ లో ఎవరూ ఊహించనంత మనస్తత్వ మార్పు కూడా వచ్చింది.  తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహార శైలిలో ఆశ్చర్యకరమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.


తోలు తీస్తా! తూక తీస్తా! తొడ గొడతా! కేంద్రాన్ని ఢీ కొడతా! హైదరాబాద్ కేంద్రంగా దేశంలోని ప్రతిపక్షాలను కూడగడతా! మూడవ ఫ్రంట్ నిర్మిస్తా! అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చిన కేసీఆర్, ఆ తర్వాత కాలంలో ఏదో పొడిచేస్తా, డిల్లీని ఊపేస్తా అంటూ ఊగిపోయిన కేసీఆర్, క్లైమాక్సులో జావకారి పోయి పూర్తిగా మెత్త బడ్డారు, కేంద్రం ముందు మోకరిల్లి  ‘నీ కాల్మొక్కుతా ….. బాంచన్ దొరా అనేలా’ సాగిలపడ్డారు.


డిల్లీ పర్యటనకు ముందు కేసీఆర్ కుటుంబం మొత్తం రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ కేంద్రానికి వ్యతిరేఖంగా వీధుల్లోకి వచ్చి తను వెనకుండి కూతురు, కొడుకు, మేనళ్ళుని ముందుపెట్టి ధర్నా చేశారు. అయితే ఈమద్యలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దెబ్బకి కాడి హైదరాబాద్ వీధుల్లో వదిలేసి డిల్లీలో పడ్డారు కేసీఆర్. అక్కడ రైతులను కలవటం మాట అటుంచి మోడీ - షా ద్వయం దగ్గర సాగిలపడ్డారని వార్తలొచ్చాయి.


ఢిల్లీ పర్యటన తర్వాత ఆయనలో మార్పు వచ్చింది. దెబ్బకి కేంద్రం దగ్గర దిగి వచ్చారు. గతంలో సేసేమిరా అన్న కెసీఅర్, తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు:


*కేంద్రం తీసుకొచ్చిన “ఆయుష్మాన్ భారత్” ను తొలుత తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్ ఆ తర్వాత ఆ పథకానికి ఇప్పుడు స్వాగతం పలికారు. గతంలో రాష్ట్రంలో తాము ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ పదకం కేంద్ర పథకం “ఆయుష్మాన్ భారత్’  కంటే వెయ్యి రెట్లు రాష్ట్ర ప్రజలకు లబ్ధిని చేకూర్చుతుంది అని ప్రచారం చేసిన మహనీయుడు కేంద్ర పథకం “ఆయుష్మాన్ భారత్’ ప్రజలకు ఎక్కువ లబ్ధిని కలిగిస్తున్నందునే ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.


*వ్యవసాయ చట్టాల విషయంలోనూ కేసీఆర్ వ్యవహార శైలి ఎవరికీ మింగుడు పడలేదు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన బంద్ కి కేసీఆర్ పూర్తి సహకారం అందించారు. కేంద్రంపై దుమ్మెత్తి పోస్తూ, చట్టాల రద్దు కోసం డిమాండ్ చేసారు. కేంద్రం సై అన్నా, తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని తెగేసి చెప్పారు. అది కేసీఆర్ వైభవంగా బ్రతికినప్పుడు, రోజుల వ్యవధిలో కేసీఆర్ మనసు మార్చుకున్నారు.


*పంట అమ్మకానికి గేట్లు ఎత్తేసి, కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు పరోక్షంగా వత్తాసు పలికారు. రాష్ట్రంలో రైతులు పండించే పంటల విషయం లో ప్రభుత్వం సూచనలు ఇవ్వదని, ఇకపై ప్రభుత్వం సేకరించబోదని కూడా తెగేసి చెప్పారు.


*ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర పథకానికి అంగీకారం తెలిపి జై కొట్టారు. రెండేళ్లుగా ఆ పథకం అమలుని తొక్కిపట్టిన ఆయన ఎట్టకేలకు అమలులోకి తీసుకొచ్చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 10శాతం రిజర్వేషన్లు ప్రకటించిన కేంద్రం 2019ఫిబ్రవరి నుంచి వాటిని అమలులో పెట్టింది.


ఈ చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం కావడంతో తెలంగాణలో దీని ప్రస్తావనే లేకుండా చేసింది కేసీఆర్ ప్రభుత్వం  దీని బదులు గతంలో తాము ప్రతిపాదించిన ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ల పెంపు కోసం కృషిచేసింది.


అయితే ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ తీర్మానించినా, దానికి చట్ట రూపం ఇచ్చేందుకు కేంద్రం మోకాలడ్డి ధారుణమైన షాకిచ్చింది. ఈ క్రమంలో అదీ ఇదీ రెండూ అమలులో లేకుండా పోయాయి. తీరా ఇప్పుడు ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ అడుగు ముందుకేశారు. తెలంగాణలో కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి స్వాగతం పలికారు. 


కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయానికి, తనయుడు పట్టాభిషేకానికి ఏదో అదృశ్య సంబంధం ఉందంటున్నారు కేసీఆర్ ను నిశితంగా గమనించే రాజకీయ విశ్లేషకులు. కేంద్రంతో సయోధ్య కోసమే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని, ఆ తర్వాత కొడుకును అధికారపీఠం అదే సీఎం చేస్తారని భావిస్తున్నారు.


కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను రాజకీయ పరిణతి అని సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్నా, కేంద్రం ముందు మోకరిల్లారంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. రాజకీయ పండితులు మాత్రం కేసీఆర్ పూర్తిగా కేంద్రం చేతిలో పావుగా మారినట్లేనని అంటున్నారు.

ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రెండేళ్ల పాటు అమలు చేయని సీఎం అగ్రవర్ణాల పేదలకు క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 


ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని అన్నారు. “ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు” వల్ల ఎవరికీ నష్టం లేదన్న ఆయన రిజర్వేషన్ల పై ముఖ్యమంత్రి దిగిరావడం సంతోషంగా ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ కులాల చిచ్చు పెడుతున్నాడని, కోటిలో ధర్నా చేస్తున్న స్టాఫ్-నర్సులపై లాఠీఛార్జ్ అమానుషం అని అన్నారు. స్టాఫ్-నర్సుల సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.



సీఎం కేసీఆర్ కాళేశ్వరం వచ్చింది శనిపూజ కోసమేనని, కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు ఫామ్-హౌస్ లో దోష నివారణ పూజలు చేసి ఆ ద్రవ్యాలను త్రివేణి సంగమంలో కలిపారని ఆయన అన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకే కేంద్రాన్ని కాకా పట్టేందుకే పర్యటన” చేశారని అన్నారు. 


కేటీఆర్ ముఖ్యమంత్రి ఐతే - ఆటమ్ బాంబ్ కాదు రాష్ట్రంలో అణుబాంబ్ - పేలుతుందన్న ఆయన ‘రక్తపు మడుగు’ లో రాజ్యం ఏలుతున్న కేసీఆర్ తో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో పొత్తుపెట్టుకోదని అన్నారు.


కేసీఆర్ పై అసహనంతో మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాపాడుకోవడం కోసమే కేటీఆర్ ముఖ్యమంత్రి పేరుతో కొత్త డ్రామా అని ఆయన అన్నారు. కెటిఆర్ ముఖ్యమంత్రి కావడాన్ని టిఆర్ఎస్ లోని చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు వ్యతిరేకిస్తున్నారన్న ఆయన “కాంగ్రెస్ - టీఆర్ఎస్ ఇద్దరూ తోడు దొంగలు” అని అన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: