తెలంగాణ ముఖ్యమంత్రి మానసపుత్రిక యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం దాదాపుగా పూర్తైంది.
త్వరలోనే ప్రధానాలయంలో భక్తులను దర్శనానికి అనుమతించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆలయ ప్రధాన పనులన్నీ ఇప్పటికే పూర్తి కాగా, మిగిలినవి త్వరితగతిన కొనసాగుతున్నాయి. స్వామి వారి కైంకర్యాలకు ఉద్దేశించిన పుష్కరిణిని సిద్ధం చేశారు. దిగువన మరో పుష్కరిణిని నిర్మిస్తున్నారు. వసంతపంచమి లేదా రథసప్తమి రోజున గుడిని పున:ప్రారంభించేందుకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందుకోసం పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.


        కొండపై ఐదేళ్ల కిందట ప్రారంభమైన  ఆలయ నిర్మాణ  పనులు పూర్తి కావచ్చాయి. నలుదిక్కులా విశాలమైన మాఢవీధులు, సప్త గోపురాలు, అంతర్ బాహ్య ప్రాకారాలు, ఆల్వార్ల విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ కృష్ణశిలా శిల్పసౌరభం ఉట్టిపడేలా పనులు జరిగాయి. శివాలయం కూడా సిద్ధమైంది. ఫిబ్రవరి 18 నుంచి 21వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు, 22 నుంచి 28 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అప్పటికే ప్రధానాలయంలోకి భక్తులను అనుమతించాలని అధికారులు భావిస్తున్నారు. బ్రహ్మోత్సవాల కంటే ముందుగానే భక్తులకు దర్శనం కల్పిస్తే.. బ్రహ్మోత్సవాల సమయానికి అన్నీ సర్దుకుంటాయనే భావనలో యాడా ఉంది.
       
                  ఫిబ్రవరి 16 వసంతపంచమి, 18న రథసప్తమి ఉన్న నేపథ్యంలో అప్పుడే పున:ప్రారంభం ఉండవచ్చని భావిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారం వరకు ముఖ్యమంత్రి నిర్దేశించిన పనులన్నీ పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ముహూర్తానికి సంబంధించి సీఎం చినజీయర్ స్వామిని సంప్రదించి తుదినిర్ణయం తీసుకోనున్నారు. సీఎం నిర్ణయానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

       కొండపైన పుష్కరిణి కూడా పూర్తి స్థాయిలో తయారైంది. కొండ కింద భక్తుల సౌకర్యార్థం మరో పుష్కరిణి పనులు జరుగుతున్నాయి. మెట్లు, ఇతర నిర్మాణల పనులు కొనసాగుతున్నాయి. ప్రెసిడెన్షియల్ కాటేజీ సహా వీఐపీ కాటేజీల నిర్మాణం కూడా పూర్తైంది. 15 కాటేజీలలో ఒకటి మినహా అన్ని పనులు పూర్తయ్యాయి. కళ్యాణకట్ట ఇంకా సిద్ధం కాలేదు.పక్కనే ఉన్న దీక్షాపరుల మండపాన్ని ప్రస్తుతానికి కళ్యాణకట్టగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

     

మరింత సమాచారం తెలుసుకోండి: