ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై అన్‌క్లారిటీ కొన‌సాగుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం, ఉద్యోగులు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తున్న స‌మ‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం మాత్రం దూకుడుతో వ్య‌వ‌హ‌రిస్తోంది. నోటిఫికేషన్‌ విడుదల చేసి, ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ముందుకు వెళ్తుండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ససేమిరా అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. 2021, జనవరి 25వ తేదీ సోమవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సిఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఈ అనిశ్చితి కొనసాగనుంది. కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికల్ని వాయిదా వేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే.


ఆ పిటిషన్ పై సోమవారం సుప్రీం కోర్ట్ లో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఎస్ఈసి నోటిఫికేషన్ ను రద్దు చేయాలంటూ గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల అఖిల అనే విద్యార్థిని హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్ళు దాటిన వారికి ఓటుహక్కు ఉందంటూ పిటిషన్ దాఖలైంది. 2019 ఓటర్ జాబితా ప్రకారం ఎన్నికలు జరిగితే 3లక్షల 60 వేలమంది ఓటు హక్కు కోల్పోతారని పిటిషన్ లో విద్యార్ధిని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా సోమవారం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టాల్సి ఉండగా.. చివరి గంటల్లో బెంచ్ మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


మొదట ఈ పిటీషన్.. జస్టిస్ లావు నాగేశ్వర రావు సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి లిస్ట్ అయింది. జస్టిస్ లావు నాగేశ్వర రావుతో పాటు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఇందు మల్హోత్రా ఈ బెంచ్‌లో ఉన్నారు. తాజాగా జస్టిస్ సంజయ్ కిషన్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బెంచ్‌కు పిటీషన్ బదిలీ అయింది. జస్టిస్ సంజయ్ కిషన్ బెంచ్‌కు దీన్ని రీలిస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: