రష్యాలో నిర‌స‌న ఉద్య‌మం తార‌స్థాయికి చేరుకుంది. ర‌ష్యాలో గ‌డిచిన కొన్ని ద‌శాబ్దాల్లో క‌నీ వినీ రీతిలో ఆందోళ‌న‌లు జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అరెస్టుకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేప‌డుతున్నారు. విడుదల చేయాలని చలి తీవ్రంగా వణికిస్తోన్న లెక్కజేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తోన్నారు. రోడ్లన్నీ నిరసనకారులతో కిక్కిరిసిపోతోన్నాయి. రష్యా ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అవినీతి అక్ర‌మాలపై పోరాడుతున్న‌ ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్ని కొద్దిరోజుల క్రితం అక్క‌డి పోలీసులు అరెస్ట్ చేయ‌డం వివాదాస్పందంగా మారింది.  దీంతో క్ర‌మంగా నిర‌స‌న‌లు ఉద్రిక్తల‌కు దారితీస్తున్నాయి.


ఎనిమిదేళ్ల కిందట ఏర్పాటైన రష్యా ఆఫ్ ద ఫ్యూచర్ రాజకీయ పార్టీకి నాయ‌కుడిగా న‌వాల్ని ఉన్నారు. ఐదు రోజుల కిందట జర్మనీ నుంచి వచ్చిన అలెక్సీని పుతిన్‌ ప్రభుత్వం వచ్చి రాగానే అదుపులోకి తీసుకుంది. మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో అలెక్సీ దిగిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. నావల్నీని అరెస్ట్ చేయడం పట్ల ఆయన మద్దతుదారులు లక్షలాది మంది నిరసన ప్రదర్శనలను చేపట్టారు. అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని నావల్నీ పిలుపునివ్వడంతో నిరసనోద్యమం రాజుకున్నది. మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ సహా రష్యా వ్యాప్తంగా ఈ ఆందోళనలు ఏకకాలంలో జరిగాయి. లక్షలాది మంది అలెక్సీ నవాల్నీ మద్దతుదారులు, ఫ్యూచర్ ఆఫ్ ద రష్యా కార్యకర్తలు, అభిమానులు రోడ్డెక్కారు.


ఎన్నికలను నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. రాజధాని మాస్కోలో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. జోరుగా కురుస్తోన్న మంచును సైతం వారు లెక్కచేయలేదు. మాస్కో వ్యాప్తంగా వేలాది మంది ఆందోళనకారులు అధికార భవనాల వద్ద బైఠాయించారు. పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలను నిర్వహించారు. ఆయన బొమ్మలను అవమాన పరిచే విధంగా కాళ్లతో తొక్కి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పోలీసులు సీన్‌లోకీ ఎంట్రీ ఇచ్చి, ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. దొరికిన వారిపై దొరికినట్లు లాఠీఛార్జీ చేశారు. మరోవైపు ఆందోళనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటివరకు 3,500 మందికిపైగా అరెస్ట్‌ చేశారు. వారిలో నావల్నీ భార్య యూలియా కూడా ఉన్నారు. గతేడాది నావల్నీపై విషప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. జర్మనీలో చికిత్స పొందిన ఆయన గతవారం రష్యాకు చేరుకోగా విమానాశ్రయంలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: