జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కలిశారు. ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన పవన్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌కు శాలువా కప్పి, బోకేను కూడా వీర్రాజు అందించారు.. అనంతరం ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, తాజా పరిస్థితులపై ఇరువురూ చాలా సేపు మాట్లాడారు.. మరీ ముఖ్యంగా త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలపై కీలకంగా చర్చించారు. ఎంపీ అభ్యర్ధిని ఎవర్ని బరిలోకి దింపాలనే విషయంపై మాట్లాడారు.



ఈ సందర్బంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు..తిరుపతిలో జరిగే ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయాలను పవన్ తో చర్చించినట్లు తెలిపారు.2024లో బీజేపీ, జనసేనలు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యం. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నాం. ఇరు పార్టీల అధ్య ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా ఆలోచన చేశాం. కుల, మత వర్గాల బేధాలు లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తాం' అని తెలిపారు.



ఇది ఇలా ఉండగా మొన్నామధ్య తిరుపతిలో పర్యటించిన పవన్ బీజేపి తో దోస్తీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన, బీజేపీ నిబద్ధతతో, కలసికట్టుగా పోటీ చేసిన తీరులోనే తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయాల్సివుందని, అప్పుడే తమ కూటమికి విలువ వుంటుందంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాటలను బట్టి చూస్తే..తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి బీజేపీ నుంచే వుంటారన్న భావన కలుగుతోందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జనసేన పార్టీ నుంచీ ఉమ్మడి అభ్యర్థి వుంటే శ్రేణులు పూర్తిస్థాయిలో ఉత్సాహంగా ఎన్నికల్లో పనిచేస్తాయని, బీజేపీ అభ్యర్థి అయితే మాత్రం ఆ స్థాయిలో శ్రేణులు పనిచేయకపోవచ్చునని ఆ వర్గాలే వెల్లడించాయి. పవన్ ఇలా అన్న రెండో రోజే సోము కలవడం చర్చనీయాంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: