తెలుగుదేశం పార్టీ పెట్టిన ముహూర్తం గట్టిది. అది ఎప్పటికీ అలాగే కొనసాగి తీరుతుంది అని ఈ మధ్యన ఎన్టీయార్ వర్ధంతి రోజున చంద్రబాబు అన్నారు. నిజంగా టీడీపీ పెట్టిన ముహూర్త బలం బహు గొప్పది. అందుకే ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఆ పార్టీ అన్నింటినీ తట్టుకుని నిలబడుతోంది. లేకపోతే 2019లో దారుణమైన పరాజయం పాలు అయిన టీడీపీకి ఇరవై నెలలు తిరగకుండా మహదవకాశం లభించింది.

అది కూడా ఏపీలో ఎన్నడూ జరగ‌ని విధంగా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎపుడు స్థానిక  ఎన్నికలు జరిగినా అధికార పార్టీ వైపే మొగ్గు ఉంటుంది. ఎందుకంటే విపక్షాలు ఎంత యాగీ చేసినా పట్టించుకోరు ఎవరూ. ఇపుడు అలా కాదు, సీన్ రివర్స్ అయింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపంలో మరో శేషన్ వచ్చారు. ఆయన తీసుకుంటున్న కఠిన చర్యలతో ఏపీలో చాలా పారదర్శకంగా  ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిమ్మగడ్డ గట్టి నిఘా పెడుతున్నారు. మరో వైపు ఏ చిన్న ఫిర్యాదు ఉన్నా సీరియస్ గా తీసుకోవడానికి ఎన్నికల యంత్రాంగం సిద్ధంగా ఉంది. మరి ఈ సమయంలో ఎన్నికలలో జనం అభిప్రాయం ఏంటన్నది కచ్చితంగా తెలిసిపోతుంది. ఏపీలో ఎన్నికలు సవ్యంగా జరిగితే 2019 లోనే టీడీపీ గెలిచేది అన్న అభిప్రాయం ఇప్పటికీ చంద్రబాబుకు ఉంది.

మరి అలాంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలెక్షన్స్ కి నిమ్మగడ్డ రెడీగా ఉన్నారు. మరి జనాల్లో తెలుగుదేశం బలం ఎంతో తేలుతుంది. ఈసారి కనుక టీడీపీ మెజారిటీ సీట్లను గెలుచుకోకపోతే మాత్రం ఇంతటి సువర్ణ అవకాశం మళ్లీ రాదనే చెప్పాలి. ఇపుడు ఎవరు గెలిచినా కూడా అది నిజమైన ప్రజాభిప్రాయానికి అద్దం పడుతుంది. ఒకవేళ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే మాత్రం కచ్చితంగా ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవు. అపుడు అధికార పార్టీ దౌర్జన్యాలు అంటూ ఎంత యాగీ చేసినా కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నిమ్మగడ్డ నేతృత్వంలో జరిగే ఎన్నికలు కాబట్టి. అన్నీ సక్రమంగానే ఆయన చూస్తున్నారు కాబట్టి. సో టీడీపీకి ఇది గొప్ప చాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: