అన్నీ అనుకున్న‌ట్టు జ‌రుగుతాయా ?.. ఎన్నిక‌లు నిలిచిపోతాయా ?.. అని నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఇప్పుడు ఎన్నిక‌ల‌కు మార్గం ఏర్ప‌డ‌డంతో మ‌రో ఆవేద‌న‌లో చిక్కుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో తీవ్రంగా దెబ్బ‌తింది. గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపుప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. అయితే.. ప‌ట్ట‌ణాల్లు, న‌గ‌రాల‌లో పార్టీ ప‌రిస్థితి బాగానే ఉన్నా..గ్రామాల్లో మాత్రం పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉంది. టీడీపీని ముందుకు న‌డిపించే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. ఇది త‌మ‌కు ఇబ్బంది క‌లిగిస్తుంద‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని నేత‌లు అంటున్నారు.

వాస్త‌వానికి ఇప్ప‌టికిప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం లేద‌ని పార్టీ నేత‌లు భావించారు. ఎన్నిక‌లు జ‌ర‌గ‌క‌పోతేనే మంచిద‌ని చాలా మంది పార్టీ నేత‌లు భావించారు. ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగే ఈ ఖ‌ర్చంతా ఎవ‌రు భ‌రిస్తార్రా బాబు అనుకున్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు.
కానీ, అనూహ్యంగా ఎన్నిక‌ల‌కు రీ షెడ్యూల్ రావ‌డం... ముందుగా గ్రామాల్లోనే ఎన్నిక‌ల‌కు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప‌చ్చ‌జెండా ఊప‌డంతో ఇప్పుడు ఏం చేయాల‌నే విష‌యంపై చంద్ర‌బాబు మ‌ద‌‌న ప‌డుతున్నార‌ని తెలుస్తోంది.

న‌గ‌రాల్లో పార్టీకి నాయ‌కులు ఉన్నారు. కానీ, గ్రామ‌స్థాయిలో మాత్రం అధికార పార్టీ దూకుడు ఎక్కువ‌గా ఉంది. ప్ర‌ధానంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన వివిధ ప‌థ‌కాల ప్ర‌భావం గ్రామ‌స్థాయిలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. గ్రామ స‌చివాల‌యాలు, వ‌లంటీర్లు, తాజాగా ఇళ్ల ప‌ట్టాల పంపిణీ గ్రామ‌ల్లో పార్టీకి చాలా ప్ల‌స్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో గ్రామీణులు ఎక్కువ‌గా వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నార‌ని టీడీపీ అధినేత‌కు స‌మాచారం అందింది. ఈ విష‌యాన్ని పార్టీ సీనియ‌ర్ నేత‌లు సైతం ప్ర‌తి రోజు బాబుకు ఫోన్ కాన్ఫ‌రెన్సుల్లో చెపుతూనే ఉన్నారు. ఇప్పుడు గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు వెళ్తుండ‌డం పార్టీకి ఇబ్బందిగా మారింద‌ని భావిస్తున్నారు. చాలా వ‌ర‌కు గ్రామ పంచాయ‌తీలు ఏక‌గ్రీవం అయినా.. ఆశ్చ‌ర్యం లేద‌ని టీడీపీ నేత‌లు అంచ‌నాకు వ‌చ్చారు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా ఉంటే బాగుండేద‌ని అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. షెడ్యూల్ వ‌చ్చిన నేప‌థ్యంలో స‌వాలుగా తీసుకుని ముందుకు వెళ్లక త‌ప్ప‌డం లేదు. క‌ష్టంగా అయినా పంచాయ‌తీ ఎన్నిక‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. అయితే.. నాయ‌కులు లేక‌పోవ‌డం, కార్య‌క‌ర్త‌లు కూడా ఎవ‌రికి వారు ఇత‌ర పార్టీల‌కు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో టీడీపీకి ఈ గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు స‌వాలుగా మార‌నున్నాయ‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: