తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేష‌న్ విడుద‌ల కావాల్సి ఉంది. అయితే.. ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీలు.. టీడీపీ, జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి, క‌మ్యూనిస్టులు వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు క‌దులుతున్నారు. టీడీపీ అభ్య‌ర్థిని ఖ‌రారు చేసింది. ఇక‌, క‌మ్యూనిస్టులుకూడా ఇక్క‌డ నుంచి పోటీ చేసి.. `ఓ వ్యూహం` ప్ర‌కారం ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వైసీపీ త‌న‌దైన పంథాలో ముందుకు సాగుతోంది. డాక్ట‌ర్ గురుమూర్తిని రంగంలోకి దింపాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.. ఇత‌ర పార్టీల కంటే  కూడా తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం ఉప పోరు.. జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మిలో క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే.

మేం పోటీ చేస్తామంటే.. మేమే దిగుతాం.. దిగుతున్నాం.. అంటూ.. బీజేపీ, జ‌న‌సేన‌ ప్ర‌క‌టించుకున్నాయి. వీటిలో బీజేపీ మ‌రింత దూకుడు పెంచి ఏకంగా పార్టీ త‌ర‌ఫున కార్యాల‌యాన్ని కూడా ప్రారంభించి.. హ‌డావుడి చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఏకంగా.. బీజేపీ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని పిలుపు కూడా ఇచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. జ‌న‌సేన దీనిపై రియాక్ట్ అయింది. త‌మ‌కే ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల జ‌న‌సేనాని ప‌వ‌న్‌తో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు భేటీ అయ్యారు. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఉమ్మ‌డి అభ్య‌ర్థిని దింపి.. గెలిపించుకుందామ‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. ఏ పార్టీ టికెట్‌పై స‌ద‌రు ఉమ్మ‌డి అభ్య‌ర్థి బ‌రిలోకి దిగాల‌నే చ‌ర్చ ఇప్పుడు వేడి పుట్టించింది.

ఉమ్మ‌డి అభ్య‌ర్థిని దింప‌డంలో ఇరు పార్టీల‌కూ అభ్యంత‌రం లేక‌పోయినా.. మ‌ళ్లీ ఇక్క‌డ ఎన్నిక‌ల గుర్తుపై, పార్టీ జెండా.. అజెండా.. ఇలా అనేక అంశాల్లో ఇరు పార్టీల‌కు విభేదాలు త‌లెత్తాయి. బీజేపీ జెండా, అజెండాల‌పై ఉమ్మ‌డి అభ్య‌ర్థి దిగినా.. త‌మ‌కు ప్ర‌యోజనం లేద‌ని.. అప్పుడే జ‌న‌సేన నేత‌లు స్వ‌రం వినిపిస్తున్నాయి. పోనీ.. జ‌న‌సేన త‌ర‌ఫున ఆ పార్టీ గుర్తుపై బ‌రిలోకి దించుతామంటే.. దీనికి బీజేపీ స‌సేమిరా అనే ప‌రిస్థితి ఏర్ప‌డింది. వాస్త‌వానికి ఆఫ్ దిరికార్డుగా.. ప‌వ‌న్‌ను గుర్తిస్తున్న బీజేపీ నేత‌లు.. ప‌వ‌న్ పార్టీని మాత్రం విశ్వ‌సించ‌డం లేదు.

దీంతో జ‌న‌సేన గుర్తుపై పోటీకి దిగే స‌మ‌స్యే లేద‌ని.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ ప‌రిణామాల‌తో ఈ రెండు పార్టీల మ‌ధ్య‌.. ఎన్నిక‌ల వ‌ర‌కు ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డి.. చివ‌రికి ఏ పార్టీ సింబ‌ల్‌పై పోటీ చేసినా.. మ‌రో పార్టీ ప్ర‌చారానికి దూరంగా ఉంటుంది. ఇది అంతిమంగా.. ఇరు పార్టీల‌కూ ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో.. చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: