ఎంతోకాలంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీ నివేదికను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అయితే ఈ పీఆర్సీ నివేదికపై టీఎన్జీవో నేతలు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ... ప్రభుత్వం విడుదల చేసిన ఈ పీఆర్సీ నివేదిక... ఉద్యోగుల వ్యతిరేక నివేదికలా ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీశారని తీవ్రంగా మండిపడ్డారు టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్. డైరెక్ట్ గా సీఎం గారినే కలిసి 63 శాతం ఫిట్‌మెంట్ అడుగుతామన్నారు. ఆర్థిక మాంద్యం ఉందని అర్ధం చేసుకొని గత 30 నెలలుగా ఓపిక పట్టామన్నారు. కానీ పీఆర్సీ కమిటీ నివేదిక మాత్రం ఉద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.




తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ నివేదికలో 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసింది పీఆర్సీ కమిషన్.. కనీస వేతనం కూడా రూ.19 వేలు ఇవ్వాలని సూచించింది.. అలాగే ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలని సిఫార్సు చేసింది. ఇక, హెచ్‌ఆర్‌ఏను తగ్గిస్తూ ప్రభుత్వానికి సూచనలు చేసిన పీఆర్సీ. హెచ్‌ఆర్‌ఏలో బాగా కోతపెట్టింది పీఆర్సీ. 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉన్న చోట 24 శాతానికి.. 20 శాతం ఉన్న చోట 17శాతానికి.. 14.5 శాతంగా ఉన్న చోట 13 శాతానికి, 12 శాతంగా ఉన్న దగ్గర 11 శాతానికి తగ్గించారు. మరోవైపు ఎన్జీవోల పిల్లల ట్యూషన్ ఫీ రియింబర్స్ మెంట్ కూడా లేదని స్పష్టం చేసింది. అలాగే ఇక గ్రాట్యూటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాలని సూచించింది. ఇక చైల్డ్ కేర్ లీవ్ (శిశు సంరక్షణ సెలవులు) 90 నుంచి 120 రోజులకు పెంచాలని సూచించింది. అలాగే సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇలాంటి ప్రతిపాదనలతో 2018, జూలై 1 నుంచి ఈ వేతన సవరణ అమలుకు పీఆర్సీ కమిషన్‌ సిఫార్సు చేసింది. అయితే పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: