ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుండి ఓ ప్రణాళిక ప్రకారం పాలన కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రణాళికకు పలు అర్థాలు వినబడుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఒక అర్థం చెబుతుంటే.... ఇతర పార్టీ నేతలు మరో అర్థం చెబుతున్నారు. "నేను ఉన్నాను... నేను విన్నాను" అన్న సీఎం జగన్.... తాను ఇచ్చిన నవరత్నాలు హామీలలో కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు పలువురు ప్రశంసిస్తుంటే... మరి కొందరు ఇదేం అభివృద్ధి అంటూ విమర్శిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్...  పట్టణ ప్రాంతాల కన్నా అధిక సంఖ్యలో పల్లెలతో నిండి ఉన్న రాష్ట్రం. ఆంధ్రాలో మెజారిటీ ప్రాంతాలు గ్రామీణమే. తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో పట్టణాలు, నగరాలు తక్కువగానే ఉన్నాయి. ఎక్కువ శాతం గ్రామాలను కలిగి ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.

అయితే ఇందుకు అనుగుణంగానే పల్లె ప్రజలను ఆకర్షించే విధంగా సీఎం జగన్ ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారని... అభివృద్ధిని పక్కనపెడితే పల్లె ప్రజలకు దగ్గరయ్యేలా పలు పథకాలతో వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రైతన్న భరోసా, నాడు నేడు స్కూళ్లు, డ్వాక్రా మహిళలకు డబ్బులు, ఇంటింటికి రేషన్, ఇంటింటికి పెన్షన్, గ్రామ సచివాలయాలు ఇలా ఈ సంక్షేమ పథకాలను చూస్తుంటే జగన్ సర్కార్ గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా ఆసక్తి చూపినట్లు అనిపిస్తోంది అంటున్నారు. ఇకపోతే ఇదే వైఖరి పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై వ్యతిరేక భావం ఏర్పడేందుకు కారణమైంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. అభివృద్ధిలో భాగమైన మౌలిక సదుపాయాలను కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లు వేయడం వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటు గ్రామాలలోనూ అటు పట్టణాల్లోనూ పెద్దగా కనబడడం లేదు.  

డబ్బులు పంచుతూ... అరకొర సంక్షేమ పథకాలతో సరిపెడుతున్నారు తప్ప..  రాష్ట్రాన్ని అభివృద్ధి  చేయడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా డబ్బులు తీసుకున్నాం కదా అని మన గ్రామీణ ప్రాంతాలలో నాడు నేడు, కొత్త ఆస్పత్రులు, గ్రామ సచివాలయాలు వంటి వాటిని అభివృద్ధి గా భావించి గ్రామీణ ప్రాంతాల ప్రజలు సీఎం జగన్ ను ఆదరిస్తారా.. లేక అసలైన అభివృద్ధి కోసం జగన్ ను వ్యతిరేకిస్తారా.. అన్న అంశాన్ని వ్యక్తం చేస్తున్నారు పలు రాజకీయ నేతలు. ఒకవేళ గ్రామీణ ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే జగన్ సర్కార్ తిరిగి మళ్లీ అదే రూట్లో వెళుతుంది లేదా గ్రామీణ ప్రజలు ఇది అభివృద్ధి కాదు అని నిరాకరిస్తే... వైయస్ జగన్ మౌలిక సదుపాయాలను పెంచి... అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: