ఎట్టకేలకు ఏపీలో స్థానిక ఎన్నికలపై ఏర్పడిన ప్రతిష్టంభన తొలిగి పోవడంతో ఎన్నికల నిర్వహణను ఎస్ఈసి వేగవంతం చేసింది.గత ఏడాది కాలంగా స్థానిక ఎన్నికలపై అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు ఎలక్షన్ కమిషన్ కు మద్య రగడ ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే  ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి ఎన్నికల నిర్వహణకు అంగీకరం తెలిపింది. ఇదిలా ఉండగా ఎన్నికల నిర్వహణను వేగవంతం చేసే ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ తో బేటీ అయ్యారు.

రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన పరిణామాలను గవర్నర్ కు వివరించినట్టు సమాచారం. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలు విషయాలను వెల్లడించారు.. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన విషయాలు పక్కనపెట్టి పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఇంకా ఆయన మాట్లాడుతూ సీఎస్, డీజీపీతోను తనకు మంచి సంబంధాలు ఉన్నట్టు తెలిపారు. అధికారులతో తనకు ఎలాంటి సమస్య లేదని చెప్తూ.. ఉద్యోగుల సంఘాలు విధుల్లో పాల్గొనాలని నిమ్మగడ్డ ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు.

ఎన్నికల విషయంలో ఎలక్షన్ కమిషన్ ను నిందించడం సమంజసం కాదంటూ ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించాలని తెలిపారు. ఇటీవల ఇద్దరు అధికారులపై ఎన్నికల కమిషన్  చర్యలు తీసుకోవడంపై.. మంత్రి చేసిన వ్యాఖ్యలు భాదకరమని ఆయన అన్నారు. తాను ఏవిధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదంటూ స్పష్టం చేశారు. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్న విషయం వాస్తవమేనని, అయితే వారిని అభిశంసన మాత్రమే చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే సస్పెండ్ చేయలేదని చెప్తూ ఇందులో ఎలాంటి కక్ష సాధింపు చర్య లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతం గురించి ఆలోచించడం మానేసి ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: