గణ తంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసకు రైతు సంఘాల నేతలే బాధ్యత వహించాలన్నారు పోలీసులు. ఢిల్లీలో మంగళవారం జరిగిన పరిణామాలపై మాట్లాడిన ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎన్ శ్రీవాస్తవ.. రైతులు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదన్నారు. తమతో చేసుకున్న  ఒప్పందాలను ఉల్లంఘింటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని చెప్పారు. రైతు సంఘాల నేతలు విద్వేష ప్రసంగాలు చేశారని, ఘర్షణల్లో పాలుపంచుకున్నారని ఆరోపించారు. వీరి వల్ల 394మందికిపైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారని చెప్పారు ఎన్ శ్రీవాస్తవ. నేరానికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలమని తేల్చిచెప్పారు.

        ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసం జరిగిన ఒక రోజు తర్వాత మీడియాతో మాట్లాడారు దిల్లీ పోలీస్ కమీషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ. రైతులు నిబంధనలను ఉల్లంఘించి ద్రోహం చేశారని మండిపడ్డారు. గడువు కంటే ముందే ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభించారని తెలిపారు. బారికేడ్లను తోసుకుని ఇతర మార్గాల్లో ఢిల్లీలోకి వచ్చారని తెలిపారు. అన్నదాతలను నియంత్రించడానికే బాష్పవాయువు, జలఫిరంగులు ఉపయోగించామన్నారు పోలీసు కమిషనర్. ఢిల్లీ హింసాకాండకు సంబంధించి ఇప్పటివరకు 25 ఎఫ్ఐఆర్లు నమోదుచేసినట్టు తెలిపారు. సీసీటీవీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు శ్రీవాస్తవ చెప్పారు.  పోలీసులు నిగ్రహంతో ఉండటం వల్లే ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదన్నారు ఢిల్లీ పోలీస్ కమిషనర్.


         మరోవైపు ట్రాక్టర్ ర్యాలీ అనంతరం రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్లు తెలుస్తోంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు రెండు రైతు సంఘాలు ప్రకటించాయి.ఉద్యమం నుంచి తప్పుకున్నట్లు అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి కన్వీనర్ వీఎం సింగ్ ప్రకటించారు.  నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం వేరేలా ఉన్నప్పుడు తాము ఉద్యమం కొనసాగించలేమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ కిసాన్ యూనియన్లోని భాను వర్గం ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించింది. హింస సమస్యకు పరిష్కారం కాదని ఆ సంఘం తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: