వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు పప్పు బెల్లాల్లా డబ్బులు పంచి పెడుతున్నారు కానీ.. జర్నలిస్ట్ ల విషయంలో మాత్రం కాస్త కూడా కనికరంలేకుండా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రయారిటీ ఇవ్వలేదు. కనీసం అక్రిడేషన్లు కూడా కొత్తవి మంజూరు చేయకుండా కాలపరిమితి పెంచుకుంటూ నెట్టుకొస్తున్నారు. తీరా 2020తో వీటి గడువు పూర్తి చేసి, కొత్త కార్డులు ఇచ్చేందుకు సవాలక్ష నిబంధనలు పెట్టారు. సగానికి సగం అక్రిడేషన్ల సంఖ్యను తెగ్గోస్తామంటున్నారు. దీంతో కడుపు మండిన జర్నలిస్ట్ లు కోర్టులో కేసు వేశారు. స్టే ఆర్డర్ ఇవ్వడంతో చివరకు జర్నలిస్ట్ లకే నష్టం జరిగింది. కొత్త కార్డులు రాక, పాత కార్డులు రెన్యువల్ చేయక ఇబ్బంది పడుతున్నారు.

ఈ దశలో స్థానిక ఎన్నికల వ్యవహారం జర్నలిస్ట్ లకు వరంగా మారింది. అక్రిడేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని, గుర్తింపు కార్డులు లేకుండా ఎన్నికల విధులకు హాజరు కావడం కష్టం అని ఎస్ఈసీ నిమ్మగడ్డకు మొర పెట్టుకున్నారు. తమకు వెంటనే అక్రిడేషన్లు రెన్యువల్ చేయాలని, అప్పుడే ఎన్నికల విధుల్లో తమకు ఆటంకాలు ఎదురు కావని చెప్పారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహా, సమాచార శాఖ కమిషనర్ కి కూడా వినతిపత్రం అందించారు జర్నలిస్ట్ సంఘాల నేతలు.

ఇప్పుడిక నిమ్మగడ్డ తీసుకునే నిర్ణయంపై జర్నలిస్ట్ ల అక్రిడేషన్ల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నిమ్మగడ్డ అక్రిడేషన్ల రెన్యువల్ కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేసినా, ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా అనేది అనుమానమే. సాధారణంగా అక్రిడేషన్లు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మంజూరు చేస్తారు. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో జర్నలిస్ట్ లు కూడా భాగమే కాబట్టి, వారి గుర్తింపు కార్డుల్ని అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్పలేం. ఒకవేళ ఈ విషయంలో కూడా నిమ్మగడ్డ పైచేయి సాధిస్తే.. నెలరోజులుగా అక్రిడేషన్లు లేక ఇబ్బంది పడుతున్న ఏపీ జర్నలిస్ట్ లకు ఇది గుడ్ న్యూస్ అవుతుంది. నిమ్మగడ్డను ఆశ్రయించి జర్నలిస్ట్ లు జగన్ కి షాకిచ్చినట్టు అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: